Thursday, October 31, 2024

ADB: ఎట్టకేలకు వడ్లమ్మిన రైతులకు డబ్బులు పంపిణీ…

కాజేసిన ఇన్చార్జి నుంచి వసూళ్లు
రూ.11 లక్షల 85వేలు చెల్లింపు
జన్నారం, జులై 20 (ప్రభ న్యూస్): ఎట్టకేలకు వడ్లమ్మిన 14మంది రైతులకు రూ.11 లక్షల85 వేలు శనివారం వరకు పంపిణీ చేశారు. నేరుగా రైతులకు డబ్బులు ఇచ్చి రషీదులు తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ సింగల్ విండో సొసైటీలో వడ్లమ్మిన 14మంది రైతుల రూ.12 లక్షల గోల్ మాల్ వ్యవహారం గతంలో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం విధితమే. గత యాసంగిలో మండలంలోని బాదంపల్లి, చింతలపల్లికి చెందిన 14మంది రైతులు బాదంపెల్లిలో ఏర్పాటు చేసిన ఆ సింగల్ విండో ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రంలో వడ్లను విక్రయించారు. సెంటర్ ఇన్చార్జి మండలంలోని చింతలపల్లివాసి గందోరి రవి ఆ రైతుల డబ్బులను సొంతానికి వాడుకొనగా, విషయం తెలుసుకున్న రైతులు ఈనెల 1న సొసైటీ కార్యాలయానికి ఆయా గ్రామాలకు చెందిన రైతులు, నేతలు దాసరి తిరుపతి, సులువ జనార్ధన్, కొండపల్లి మహేష్, కె.మనోహర్ రావు, తదితరులు విచారణకు వచ్చిన అధికార్లను లోపల ఉంచి కార్యాలయ గేటుకు తాళం వేసి ఆందోళన చేశారు.

దీంతో అప్పుడు మంచిర్యాల డీసీఓ రామ్మోహన్ ఆదేశాల మేరకు సొసైటీ సబ్ రిజిస్టర్ రవీందర్ రావు, కార్యాలయ సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు విచారణ చేశారు. ఆ విచారణలో ఆ సెంటర్ ఇన్చార్జి గందోరి రవి ఆ డబ్బులను ఇతర రైతుల ఖాతాలోకి మార్చి కాజేసినట్లు ఒప్పుకొని, తిరిగి డబ్బులు చెల్లిస్తానని రాతపూర్వకంగా రాసి సొసైటీకి అందజేశారు. ఈ వ్యవహారమై సొసైటీ చైర్మన్ అల్లం రవి, సెంటర్ ఇన్చార్జి గందోరి రవి పైఈ నెల 5న స్థానిక పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు.

ఆ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మిక్కిలినేని రాజశేఖర్ ప్రత్యేక చొరవతో, ఆ సొసైటీ చైర్మన్ అల్లం రవి, డైరెక్టర్లు ఎండి సాదుపాషా, కానగంటి స్వరూపరాణి దేవన్న, బి.సత్యనారాయణ, అనుముల శ్రీనివాస్ లు శ్రద్ధ తీసుకొని అటు రైతులతోనూ, సెంటర్ ఇన్చార్జి రవి, కార్యదర్శి రాజన్న తోను సంప్రదించి ఓ నిర్ణయానికి వచ్చి ఇన్చార్జి రవి చెక్కులను సొసైటీకి ఇప్పించి, ఈనెల 20లోగా ఆ డబ్బులన్నింటిని రైతులకు చెల్లిస్తానని బాండ్ పేపర్ రాయించుకొని, కార్యదర్శి చెక్కులను రైతులకు అందజేశారు. రైతులు నష్టపోవద్దని సదుద్దేశంతో ముందుగా సెంటర్ ఇన్చార్జి రవి రూ.11లక్షల 85 వేలు మండలంలోని బాదంపల్లి, చింతలపల్లికి చెందిన మోటపలుకుల కమలాకర్, అరవ్వ, భూమన్నలతో పాటు 14 మంది రైతులకు ముందుగా చెప్పినట్లు శనివారంకు నగదు డబ్బులను అందజేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement