జన్నారం : చెట్లు పెట్టాల్సింది పోయి పల్లె ప్రకృతి వనంలోని చెట్లను నరికి వేస్తున్న సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటు చేసుకుంది. రాంపూర్ గ్రామం పల్లె ప్రకృతి వనంలోని 500 చెట్లను ఇద్దరు వ్యక్తులు నరికివేశారు. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని అంచనా.. పల్లె ప్రకృతి వనంలో సుమారు 2000 నీలగిరి, కానుగ, అడవి తంగేడు, ఇతర పండ్ల మొక్కలు నాటారు. గత కొంతకాలంగా ఆ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అదును చూసి ఆ చెట్లను నరికి వేస్తున్నారు. తాజాగా సుమారు 200 చెట్లను నరికి వేశారు.
ఇదే పల్లె ప్రకృతి వనంలో గతంలోనూ 300 చెట్లను నరికి వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై గ్రామ కార్యదర్శి నలిమెల వెంకటి, స్థానిక ఎంపీడీవో ఠాగూర్ శశికళకు, తహసిల్దార్ రాజమనోహర్ రెడ్డికి, ఎంపీఓ రమేష్ కు ఫిర్యాదు చేశారు. వ్యవహారమై తాహసిల్దార్, ఎంపీడీవోను సంప్రదించగా, గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆ చెట్లను నరికి వేస్తున్నారని కార్యదర్శి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విచారణ జరిపి ఆ ఇద్దరిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వమని కార్యదర్శికి సూచించామన్నారు. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశమైంది.