Thursday, November 21, 2024

ADB | కల్తీ వరి విత్తనాలతో లబోదిబోమంటున్న గిరిజన రైతులు

జన్నారం, (ఆంధ్రప్రభ): వేసుకున్న వరి పంట ఓ కంపెనీ వరి విత్తనాలు కోత దశకు వస్తేగాని కల్తీవని, నకిలీవని గ్రహించలేదని రైతులు లబోదిబోమంటున్నారు. అరగాలం కష్టపడి ఓ కంపెనీ వరి విత్తనాలు పెట్టుకుని పంట దిగుబడి వస్తుందని ఆశపడ్డ రైతులకు నిరాశ ఎదురైంది. 30 మంది గిరిజన రైతులు మండల కేంద్రంలోని పలు విత్తన, ఫర్టిలైజర్ షాపుల యజమానుల నుంచి వరి విత్తనాలు కొనుగోలు చేసుకుని విత్తుకున్నప్పటికీ, ఆ విత్తనాలు కోతదశకు వస్తే గాని కల్తీ, నకిలీవని గ్రహించలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల, కొత్తపేట, హాస్టల్ తాండ, బంగారుతాండాలకు చెందిన గిరిజన రైతులు పవార్ దినేష్ కుమార్, రాథోడ్ తిరుపతి, భూక్య గబ్బర్ సింగ్, అమర్ సింగ్, లాకవత్ హరిలాల్, లక్ష్మణ్, రవీందర్, సొమ్లా నాయక్ తో పాటు 30 మంది రైతులు గురువారం స్థానిక మండల వ్యవసాయశాఖ అధికారిణికి ఫిర్యాదు చేశారు.

తాము ఎంతో ఆశతో దిగుబడి వచ్చి అధిక లాభాలు ఆర్జిస్తామని నమ్మకంతో ఓ కంపెనీకి చెందిన విత్తనాలను మండల కేంద్రంలోని పలు ఎరువులు, విత్తన షాపుల యజమానుల నుంచి కొనుగోలు చేసుకుని వెళ్లి విత్తుకున్నప్పటికీ, ఆ విత్తనాలు నకిలీ, కల్తీయని వరి పంట గొలుకలను బట్టి చూస్తే అర్థమవుతుందని వారు తెలిపారు.

ఈ విషయం గ్రహించిన తాము ఆయా షాపుల యజమానుల వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, ఆ షాపుల యజమానులు కంపెనీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పినప్పటికీ,ఏమాత్రం ఫలితం లేదని, తమను ఎవరు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో జిల్లా పాలనాధికారి, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుని నష్టపోయిన తమకు పరిహారం ఇప్పించి, న్యాయం చేయాలని ఆ గిరిజన రైతుల కోరారు.

ఈ విషయమై స్థానిక మండల వ్యవసాయశాఖ అధికారిణి కస్తూరి సంగీతను సాయంత్రం సంప్రదించగా, 30 మంది గిరిజన రైతులు వేసుకున్న ఓ కంపెనీ వరి విత్తనాలు కల్తీవని తమకు ఫిర్యాదు చేశారన్నారు. తాను ఈ విషయాన్ని ఆ కంపెనీ ప్రతినిధులకు తెలియజేశానని ఆమె తెలిపారు. ఆ విత్తనాలు కల్తీ, నకిలీవని తాను చెప్పలేనని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు నిర్ధారించవలసి ఉందని ఆమె చెప్పారు. రైతులకు న్యాయం జరిగేలాగా చూస్తానని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement