నిరుద్యోగ సమస్య తీరాలన్నా, సింగరేణి కార్మికుల బతుకులు మారాలన్నా , రైతులకు రుణమాఫీ కావాలన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విజయభేరీ సభలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తూర్పార బట్టారు. ముఖ్యంగా రామగుండం ఎమ్మెల్యేపైనా, సీఎం కేసీఆర్పైనా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్నడిన తరువాత జరిగిన ఎన్నికల్లో రామగుండం అభివృద్ది కోసం, సింగరేణి కార్మికుల కోసం కేసీఆర్ హామీలు గుప్పించారని, కేంద్రప్రభుత్వంతో సమానంగా జీతాలు ఇస్తానని, సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేస్తానని, ఓపెన్ కాస్ట్ గనులను మూసి వేస్తానని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ గొప్పలు పోయారని, సొంతింటి కల తీరిందా? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఓపెన్ బొగ్గు గనులు మూశారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఓపెన్ కాస్ట్ గనులతో ఆదిలాబాద్ జిల్లా బొందల పడ్డదని, కార్మికులు అనారోగ్యంతో, కేన్సర్తో చచ్చిపోతున్నారని, ఓపెన్ కాస్ట్ గనులు మూసే వరకూ పోరాడుతానని చెప్పిన కేసీఆర్ ఇప్పడు ఏఎమ్మార్ సంస్థకు ఓపెన్ కాస్ట్ గనులను అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రామగుండంలో ఒకప్పుడు నాలుగు లక్షల మంది ఉంటే.. ఇప్పుడు రెండు లక్షల మందే ఉన్నారని, రెండు లక్షల మంది వలస పోయారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రామగుండం ఎమ్మెల్యేపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కుటుంబ సభ్యులు మృతితో స్రజలు సానుభూతితో గెలిపిస్తే.. సింగరేణి ప్రజల కోసం .. హక్కుల కోసం పోరాడుతానని నమ్మబలికి.. చివరికి అవినీతిలో కూరుకుపోయారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ బందిపోటు దొంగకు సీటు ఇవ్వరని అనుకుంటే .. తాను వసూలు చేస్తున్న వసూళ్లలో కప్పం కడుతున్నందునే కేసీఆర్ మళ్లీ టిక్కెట్టు ఇచ్చారని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శ చేశారు.
బొగ్గు దోపిడీ, ఇసుక దోపిడీ, బూడిద దోపిడీలో రామగుండం ఎమ్మెల్యే ఆరితేరాడన్నారు. ఇక సింగరేణి అధికారి ఎనిమిదేళ్లుగా తిష్ట వేశారని, వందల కోట్లు కేసీఆర్కు కప్పం కడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి కార్మికుల సంఘానికి ఎన్నికలు నిర్వహించటం లేదని, సింగరేణి కార్మికుల కళ్లల్లో కళ్ళు పెట్టి చూడగలిగే దమ్ము కేసీఆర్కు ఉందా ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సింగరేణి ప్రజల సమస్యలు తీరుతాయని, జనం ప్రాణాలను హరిస్తున్న ఓపెన్ కాస్ట్లో కేసీఆర్ను బొందలో పెట్టాలంటే.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను రేవంత్ రెడ్డి కోరారు.