బైంసా : పట్టణంలోని 26 వార్డులలో డబుల్ బెడ్ రూం కొరకు దరఖాస్తుల స్వీకరణ గత 3 నెలల క్రితం తీసుకోగా… దాదాపు 8000 పై చిలుకు దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దాదాపు 640 డబుల్ బెడ్ రూమ్లని నిర్మించగా, దీంట్లో గుండేగాం ముంపు గ్రామ ప్రజల కోసం దాదాపు 200 ఇండ్లు తాత్కాలిక నివాసంగా ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 440 ఇండ్లకి నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఎంపిక విధానంపై ఇంకా సరైన స్పష్టత లేకప్రజలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకి డ్రా నిర్వహించగా డ్రాలో పేరు రాని ప్రజలు డబుల్ బెడ్ రూం రాకపోయిన స్థలంఉన్నా వారికీ ఇంటి నిర్మాణం నిమిత్తం అందించే మూడు లక్షల రూపాయల కొత్త ప్రభుత్వ స్కీమ్ కి అర్హులుగా ఉంటామా..! లేదా..! అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంద్రమ్మ ఇండ్ల స్థలాలు ఇచ్చిన వారి పరిస్థితి ఏంటి..?
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదప్రజలకి ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇండ్ల స్థలాలను మంజూరు చేసింది. నిర్మాణాల కొరకు ప్రత్యేక అకౌంట్లలలో విడుతల వారీగా నగదు కూడా జమ చేసింది. అయితే పట్టణానికి చెందిన బోర్ర గణేష్ సమీపంలో ఇందిరమ్మ ఇండ్లకి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాన్నిమంజూరు చేయగా, దాదాపు వందకు పైగా మంది ఇందిరమ్మ ఇండ్ల స్థలాలలో బేస్మెంట్ వరకు నిర్మాణాలు నిర్మించి, మళ్లీ నిధులు రాకపోవడంతో అలానేవేచి ఉంచారు. కాల క్రమేణ ప్రభుత్వాల మారుతూవుండడంతో ఇంద్రమ్మఇంటి నిర్మాణాలు కాస్త అలానే కుంటుపడిపోయాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు పట్టణ సరిహద్దులలో ప్రభుత్వ స్థలాలను వెతకగా ఎక్కడ అనువైనస్థలం దొరకలేదు. దీంతో గతంలో బైంసా పట్టణం బోర్ర గణపతి సమీపాన ఇంద్రమ్మ ఇండ్లకు కేటాయించిన స్థలాలలోనే నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. వారు కట్టుకున్న బేస్మెంట్ లెవెల్, గోడల లెవల్ ఇండ్లను చెరిపేసే పరిస్థితి వచ్చింది. ఇంద్రమ్మఇండ్ల స్థలాల లబ్ధిదారులు, ఇంద్రమ్మ స్థలాలలో ఇంటి నిర్మాణం కోసం బేస్మెంట్, గోడల వరకి నిర్మాణాలు చేపట్టిన ప్రజలు, ఇక్కడ డబల్ బెడ్రూమ్స్ నిర్మించనివ్వబోమంటూ తొలుత ఆందోళన చేపట్టారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, అదికారులు కలిగించుకొని డబల్ బెడ్రూమ్స్ కి అనువైన స్థలం ఇదేనని ఇందిరమ్మ ఇండ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనివ్వండంటూ స్థల ప్రజలని కోరారు. ఇక్కడ ఇండ్ల స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడే డబుల్ బెడ్రూమ్స్ అందేలా కృషి చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ఎట్లాగో డబల్ బెడ్రూమ్ వస్తుందని ఇందిరమ్మ ఇండ్ల స్థల ప్రజలు అంగీకారం తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే అధికార సిబ్బందికి చెప్పగా.. ఇంద్రమ్మ ఇళ్ల స్థలాలు ఉన్నవారి వివరాలను, వారి వారి స్థలాలలోని నిర్మాణాల ముందు లబ్ధిదారులు దిగిన ఫోటోలతో సహా అధికారులు నమోదు చేసుకున్నారు. నేడు డ్రా అనే సరికి మాకు డబల్ బెడ్రూమ్స్ లో చోటు ఉందా..? లేదా..? లేకపోతే మా స్థలం ఇచ్చిన వాటిపైనే నిర్మించిన ఇండ్లలో మమ్మల్ని పక్కకు నెట్టడం ఎంతవరకు సమంజసం అని స్థలప్రజలు ఆవేదన చెందుతున్నారు. డబల్ బెడ్రూమ్స్ తమకి ఇవ్వాలని ఇటీవల శాసనసభ్యుని సైతం విన్నవించారు.
అయోమయంలో స్థలాలు ఇచ్చిన వారి పరిస్థితి
ప్రస్తుతం డబల్ బెడ్రూమ్స్ కొరకు దరఖాస్తులనగానే నిర్మాణాల నిమిత్తం ఇంద్రమ్మ స్థలాలు ఇచ్చిన ప్రజలు అయోమయంలో పడ్డారు. డబల్ బెడ్రూమ్స్ మొదట అనుకున్నట్లుగానే స్థలాలు ఇచ్చిన ప్రతిఒక్కరికి హామి ఇచ్చినప్రకారం డబల్ బెడ్రూమ్ వస్తాయా..! లేక రావా..! అంటూ గతంలో తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చినా ఇంకా అప్లై చేసుకొన్నారు. చేపట్టిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల్లో మొదట ఇంద్రమ్మ స్థలాలు ఇచ్చిన ప్రజలకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.
అధికారులు సరైన వారినే ఎంపిక చేశారా..?
డబల్ బెడ్రూమ్స్ అర్హులను గుర్తించే పనిలో అధికారులు విఫలమైనట్లు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు గ్రామసభలు నిర్వహించిన తూతూ మంత్రంగానే చర్యలు జరిగాయని… సరైన అర్హులను పక్కన పెట్టారని ఇల్లు, ప్లాటు, వాహన బండ్లు, వ్యవసాయ భూములు కలిగిన పలువురుని లిస్టులలో జోడించారని… నిలువ నీడలేని ప్రజలను పక్కనపెట్టి ఇలా అనార్హులకు లిస్టులో చోటు ఇవ్వడంపై ఆవేదన చెందుతున్నారు. గతంలో అధికారులు గుర్తించే పని నిమిత్తం కిసాన్ గల్లీలో పర్యటించగా ప్రజలు అధికారులతో వాదనకు దిగారు. ఏదేమైనా నేడు జరిగే డ్రాలో ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఉంటాయని ప్రజలంటున్నారు.