బెల్లంపల్లి, ఆగస్టు 10(ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పట్టణంలోని పలు సింగరేణి కాలనీల్లో సింగరేణి విద్యుత్ విభాగం అధికారులు తొలగించిన విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి సింగరేణి కాలనీలకు చెందిన ప్రజలు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్త మారి సూరిబాబు, ఐఎన్టీయూసీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ప్రజలు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి యాజమాన్యం టేకులబస్తి, కన్నాల బస్తి, నెంబర్ 2 ఇంక్లైన్ బస్తి, హనుమాన్ బస్తి, బూడిదిగడ్డ బస్తి, తదితర కాలనీల్లో కార్మికుల క్వార్టర్లకు సమాచారం లేకుండా విద్యుత్ కనెక్షన్లు తొలగించడం అన్యాయమన్నారు.
పదిరోజులుగా కార్మికులు చీకట్లో ఉండాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని వారు తెలిపారు. గత నాలుగు సంవత్సాల క్రితం బెల్లంపల్లిలోని సింగరేణి క్వార్టర్లను అప్పటి ప్రభుత్వం నివాసం ఉంటున్న కార్మికులకు హైండోవర్ చేసిందన్నారు. సింగరేణి లోని వివిధ ఏరియాల్లో బొగ్గు గనుల్లో పనిచేస్తూ బెల్లంపల్లిలో గల 3800 క్వార్టర్లలో కార్మికులు నివసిస్తున్నారని వారు తెలిపారు. ఈ విషయంపై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంటనే జోక్యం చేసుకొని కార్మికులకు సింగరేణి విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.