Tuesday, November 19, 2024

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు..

మంచిర్యాల : యాసంగి వరిధాన్యం కొనుగోళ్లకు జిల్లా వ్యాప్తంగా 250 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా జీవో నెంబర్‌ 9 ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అధనపు కలెక్టర్‌ మధుసుదన్‌ నాయక్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ, జిల్లా పౌరసరఫరాల శాఖ, జిల్లా రవాణా శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా సహకార శాఖ, జిల్లా మార్కెటింగ్‌ శాఖ, డీసీఎంఎస్‌, రైస్‌మిల్లర్లు, సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించడం కోసం సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని, గతంలో ఎదురైన తప్పులను సరిదిద్దుకొని రైతులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో 2లక్షల మెట్రిక్‌ టన్నుల దాన్యం కొనుగోలు చేయగా ఈ సంవత్సరం 2.30లక్షల మెట్రిక్‌ టన్నుల దాన్యం వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు గన్నీ సంచులను అందుబాటులో ఉంచడంతో పాటు రవాణా చేసేందుకు అవసరమయ్యే వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేది నుండి వరి కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులందరికి టోకెన్లను అందజేసి సంబంధిత వరిధాన్యం కేంద్రాలకు వెళ్లేలా రైతులకు అవగాహన కల్పిస్తూ జీవో నెంబర్‌ 9 ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ను
ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వరిధాన్యాన్ని తీసుకువచ్చే సమయంలో తేమ శాతంతో పాటు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో వారికి సూచించిన ఆదేశాల ప్రకారం కలిసికట్టుగా పనిచేసి వరిధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటూ జిల్లాకు మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలని కోరారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం పెరిగినందున దిగుబడి కూడా పెరుగుతున్న క్రమంలో అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్‌కుమార్‌, జిల్లా మేనేజర్‌ గోపాల్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి గజానంద్‌, జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య, జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి, జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నల్మాస్‌ కాంతయ్య, తూనికలు, కొలతల శాఖ అధికారులు, రైస్‌మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement