Sunday, November 24, 2024

ADB | తానిమడుగు అడవుల్లో టేకు చెట్ల నరికివేత..

జన్నారం, (ఆంధ్రప్రభ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యంలోని తాళ్లపేట రేంజ్ పరిధిలోని తానిమడుగు అటవీ బీటులో ముకుమ్మడిగా సుమారు 30 టేకు కలప చెట్లను నరికి రంపాలతో దుంగలు తయారుచేసి గోదావరి పక్కనే ఉన్న జగిత్యాల జిల్లాలోని పలు కలప సామిళ్ళకు తరలించినట్లు సమాచారం.

ఈ వ్యవహారమై అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఓ వ్యక్తి సమాచారం చేరవేయడంతో వెంటనే స్పందించిన ఉమ్మడి జిల్లా కేటీఆర్ ఎఫ్డీపీటీ శాంతరాం ఫ్లయింగ్ స్క్యాడ్ బృందాన్ని విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. దీంతో శుక్రవారం మంచిర్యాల ఫ్లయింగ్ స్క్యాడ్ రేంజ్ ఆఫీసర్, బృందం ఆ తానిమడుగు అడవుల్లోకి వెళ్లి తనిఖీ నిర్వహించగా, సుమారు 30 టేకు చెట్లను కలప స్మగ్లర్లు నరికి వేసినట్లు, నరికి వేసిన ఆ టేకు కలప చెట్ల మొదల్లను గుర్తించి కొలతలు తీసి నంబర్లు వేసినట్లు తెలిసింది.

ఈ విషయమై మంచిర్యాల ఫ్లయింగ్ స్క్యాడ్ రేంజ్ అధికారిణి రమాదేవిని శుక్రవారం రాత్రి చరవాణిలో సంప్రదించగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తానిమడుగు అడవుల్లో టేకు చెట్ల నరికివేతపై విచారణ జరిపామన్నారు.ఎన్ని టేకు కలపచెట్లు నరికివేతకు గురైన సంఖ్య,వాటి విలువను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement