Saturday, November 23, 2024

కరోనా కరాల నృత్యం..

మంచిర్యాల: జిల్లాలో కరోనా కరాల నృత్యం చేస్తోంది. రోజురోజుకు కరోనా వ్యాధి బారీన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. గత రెండు రోజుల నుండి టీకా కార్యక్రమాన్ని నిలిపివేసిన అధికారులు మళ్లఅ ప్రారంభించనున్నారు. ఆసుపత్రుల్లో సరిపోను వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. టోకెన్ల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు ర్యాపిడ్‌ టెస్టు కిట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సగం మంది వెనుదిరిపోతున్నారు. వ్యాధిబారీన పడిన వారు చాలా మంది భయంతోనే మృత్యువాత పడుతున్నారు. భయమే వారి పాలిట యమపాషంగా మారుతోంది. పై#్రవేటు ఆసుపత్రుల దోపిడీ కొనసాగుతూనే ఉంది. నల్ల బజారులో రెమిడెసివర్‌ ఇంజక్షన్‌ ధర రూ.35వేలకు చేరింది. కృత్రిమ కొరత సృష్టించిన మెడికల్‌ మాఫియా బాధితులను జలగల్లా పీల్చుకు తింటోంది. మంచిర్యాలలో రెమిడెసివర్‌ ఇంజక్షన్లు అందుబాటులో లేవంటూ కరీంనగర్‌, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల నుండి తెప్పిస్తున్నట్లు తెలుపుతూ ధరను పెంచుకుంటూ పోతున్నారు. మే నెలలో పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లకు తప్పనిసరిగా సంబంధిత తహశిల్దార్ల నుండి అనుమతి తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హొళ్లికేరి ఆదేశాలు జారీ చేశారు. అబ్బాయి తరుపున 25 మంది, అమ్మాయి తరుపున 25 మందికే అనుమతిస్తూ ఆ లోపలే బంధువుల సమక్షంలో వివాహ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల్లో వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చంధ లాక్‌డౌన్‌ను విధించుకున్నాయి. మంచిర్యాల పట్టణంతో పాటు జన్నారం, లక్షెట్టిపేట, కాసిపేట, బెల్లంపల్లి, కోటపల్లి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు స్వచ్చంధ లాక్‌డౌన్‌ను విధించుకొని రాకపోకలను నియంత్రిస్తూ కరోనా కట్టడికి తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయడంతో ప్రధాన వీధులన్ని నిర్మానుష్యంగా మారాయి. వైద్యాధికారులు, ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసినప్పటికీ కరోనా ఉదృతి ఒకవైపు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడకుండా ఇష్టారీతిన ప్రదర్శిస్తున్నారు. మాస్కులు ధరించకుండా, మార్కెట్‌ ప్రాంతాల్లో గుంపులుగుంపులుగా తిరుగుతూ సామాజిక దూరం పాటించడం లేదు. కరోనా లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఉంటూ వైద్య సేవలు పొందాలని సూచిస్తున్నప్పటికీ పలువురు బహిరంగంగానే తిరుగుతూ ఇతరులకు వ్యాధిని అంటగడుతున్నారు. వైద్యాధికారులు, పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటూ అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పుకనిపించడం లేదు. ప్రజల్లో కరోనా చైతన్యంతో పాటు బాధ్యతను గుర్తెరిగి ప్రభుత్వం సూచించిన సూచనలు పాటిస్తే తప్ప కరోనా మహమ్మారిని తరిమికొట్టడం కష్టసాధ్యంగా మారుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement