పెద్దపల్లి, ఆంధ్రప్రభ: లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినప్పటికీ మంత్రి శ్రీధర్‌బాబు కీలకపాత్ర వహించి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని గట్టెక్కించారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన మంథని సెగ్మెంట్ తప్ప మిగిలిని సెగ్మెంట్లలో కాంగ్రెస్ మెజార్టీ తగ్గింది. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో ఏడు సెగ్మెంట్లో మంథనిలోని కాంగ్రెస్‌కు 55,723 ఓట్లు మెజార్టీ వచ్చింది. శాసనసభ ఎన్నికలకు భిన్నంగా ఓటర్లు కమలం వైపు మొగ్గు చూపారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ సునాయసంగా గెలుస్తుందని భావించగా, అనూహ్యంగా బీజేపీ బలం పెరిగింది. దీంతో కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. గత శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడుగురు కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. శాసనసభ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లో కాంగ్రెస్ మెజార్టీ 3,05,830గా ఉండగా, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కి 1,31,364 మెజార్టీ వచ్చింది. అంటే శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి కాంగ్రెస్ మెజార్టీ 50 శాతం కంటే ఎక్కువ పడిపోయింది.
మెజార్టీ తేడా ఇలా ఉంది…
ఐదు నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూరులోని శాసనభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 37,515 ఓట్ల మెజార్టీ రాగా, ప్రస్తుతం 25,714 ఓట్ల మెజార్టీ వచ్చింది. బె ల్లంపల్లి లో 36,878 ఓట్ల మెజార్టీ రాగా, ఈ ఎన్నికల్లో 26,520 ఓట్ల మెజార్టీ, మంచిర్యాలలో 66,116 మెజార్టీ రాగా, ఈ ఎన్నికల్లో 19,365 ఓట్ల మెజార్టీ వచ్చింది. ధర్మపురిలో 22,039 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్‌కు రాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కంటే 9,995 ఓట్లు తక్కువ వచ్చాయి. రామగుండంలో శాసనసభ ఎన్నికల్లో 56,794 ఓట్ల మెజార్టీ రాగా, ఈ ఎన్నికల్లో 10,131 ఓట్ల మెజార్టీ, పెద్దపల్లిలో 55,108 ఓట్ల మెజార్టీ రాగా, ఈ ఎన్నికల్లో 5,325 ఓట్ల మెజార్టీ వచ్చింది. మంథనిలో శాసనసభ ఎన్నికల్లో 31,380 ఓట్ల మెజార్టీ రాగా, ఈ ఎన్నికల్లో 55,723 ఓట్ల మెజార్టీ వచ్చింది.