నిర్మల్ జిల్లా బాసర.. : తమ కాలనీల్లో నెలకొన్న రహదారులు, మురుగుకాల్వల డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు ధర్నాకు దిగారు. రెండుసార్లుగా అదే కాలనీలలో ఉప సర్పంచ్ గా పదవులు పొందినప్పటికీ కనీసం నాయకులు తమ కాలనీ సమస్యల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ముందు శారద నగర్ కాలనీవాసులు ఆందోళన దిగారు. ప్రతివర్ష కాలంలో తమ కాలనీలో వర్షపు నీరు నిలవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.
అదేవిధంగా స్థానిక ఉపసర్పంచ్ అన్వరి బేగంకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని శారదనగర్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఐదు సంవత్సరాల ఎన్నికల సమయంలో తాము గుర్తుకొస్తాము తప్ప.. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నెరవేర్చలేని దుస్థితి ఏర్పడిందని కాలనీ వాసులు అంటున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, అధికారులు స్పందించి తమ కాలనీల్లో నెలకొన్న ప్రధాన రహదారులు, మురుగు కాలువలడ్రైనేజీల సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.