Tuesday, November 26, 2024

కోల్‌బెల్టులో సికాస పున:రుద్దరణకు యత్నాలు

మంచిర్యాల : మావోయిస్టు మాజీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు అభయ్‌ అలియాస్‌ వారణాసి సుబ్రమణ్యం అలియాస్‌ శ్రీకాంత్‌ అలియాస్‌ విమల్‌తో పాటు అతని భార్య మావోయిస్టు డీసీఎం కమిటీ సభ్యురాలు వారణాసి విజయలక్ష్మి అలియాస్‌ శ్రీధరను విజయవాడ రైల్వే స్టేషన్‌లోపట్టుకున్నట్లు రామగుండం కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ వి.సత్యనారాయణ సోమవారం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సింగరేణి ప్రాంతంలో సికాస పున:రుద్దరణ కోసం ఈ ఇద్దరు దంపతులు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ మావోయిస్టు ప్రస్తుత తెలంగాణ విద్యావంతుల వేధిక గౌరవ అధ్యక్షుడు గురిజాల రవీందర్‌రావు ఇంటికి చాలా సార్లు వచ్చి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం అందగా గత ఆదివారమే గురిజాల రవీందర్‌రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు అభయ్‌ దంపతులు వివిద ప్రదేశాల్లో తనిఖీ చేయగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో సంచరిస్తున్నట్లు తెలియడంతో వారిని అరెస్ట్‌ చేసి మంచిర్యాలకు తరలించినట్లు పేర్కొన్నారు. గతంలో సికాసలో పనిచేసిన వారణాసి సుబ్రమణ్యం సికాస పాత నాయకులను కలుసుకుంటూ పున:రుద్దరించే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కపురానికి చెందిన సుబ్రమణ్యం 1980 ప్రాంతంలో ఆదిలాబాద్‌ జిల్లాలో పనిచేశాడని, 2004 సంవత్సరంలో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా ఎదిగాడని, తదనంతరం ఉత్తర భారత దేశంలో పార్టీ కోసం పనిచేశాడని, హర్యాన, పంజాబ్‌, ఢిల్లీ ప్రాంతాల్లో పనిచేస్తూ 2011 సంవత్సరంలో బిహార్‌ రాష్ట్రంలో అరెస్ట్‌ అయి 2019లో బేయిల్‌పై విడులైన అనంతరం మావోయిస్టు కేంద్ర కమిటీ సూచనల మేరకు తెలంగాణ ప్రాంతంలో సికాస పునర్వేభవం కోసం కార్యకలాపాలు సాగిస్తున్నాడని, అందులో భాగంగా క్యాతనపల్లిలో గురిజాల రవీందర్‌రావు ఇంటికి పలుమార్లు వచ్చి వెళ్లి తిరిగి పంజాబ్‌లోని చండీగడ్‌లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి ఢిల్లీ నుండి వస్తున్న క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇతని భార్య అయిన విజయలక్ష్మి గతంలో బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌లో పనిచేస్తూ వాలంటరీ రిటైర్ట్‌మెంట్‌ తీసుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని వారణాసి సుబ్రమణ్యం అరెస్ట్‌ అయిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లి అతను బేయిల్‌పై విడుదలైన అనంతరం పార్టీ సూచన మేరకు ఇద్దరు కలిసి ఉత్తర భారత దేశంలో పనిచేశారని పేర్కొన్నారు. వీరి వద్ద నుండి విప్లవ సాహిత్యంతో పాటు లాప్‌ట్యాప్‌, సెల్‌ఫోన్లు, మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ తీర్మాణ కాపీలను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు కమీషనర్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement