సీఎం కేసీఆర్ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి కడెం ప్రాజెక్టులో వదర పరిస్థితిపై ఆరా తీశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం మంత్రిని ఆదేశించారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో, మంపు గ్రామాలు, సహాయక చర్యలను సీఎంకు మంత్రి వివరించారు. వరద కొంత తగ్గుముఖం పట్టిందని సీఎంకు వివరించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కడెం పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
కడెం ప్రాజెక్టుకు ప్రమాదకర స్థితిలో వరదనీరు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతంలో ఇటు ఎస్సారెస్పీ నుంచి అటు బోథ్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులోకి చేరుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ ముష్రఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితులను సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నామన్నారు. అలాగే సీఎస్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు అధికారులు ఇక్కడ ఉన్నతాజా పరిస్థితిని వివరిస్తున్నారు. ఇప్పటికైతే కొద్దిగా వరద నీటి ప్రవాహం తగ్గింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.