Thursday, November 21, 2024

Nirmal: మాస్టర్ ప్లాన్ పేరిట కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ బీఆర్ఎస్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, ప్రతినిధి, ఆగస్టు 10 (ప్రభ న్యూస్) : నిర్మల్ పట్టణంలో కొత్త మాస్టర్ ప్లాన్ పేరిట అధికార పార్టీ నేతలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం నిర్మల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. గ్రీన్ జోన్ లో ఉన్న పంట పొలాలను ఇండస్ట్రియల్ జోన్ లోకి మార్చి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న సోఫినగర్ ప్రాంతాన్ని కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ గా మార్చి అక్కడ అధికార పార్టీ నేతలు ముందు కొన్న భూముల విలువలు అమాంతం పెంచుకొని కార్పొరేట్ సంస్థలకు అమ్ముకొని కోట్లు గడిస్తూ నిర్మల్ పట్టణ ప్రజలను నిండా ముంచుతున్నారని ధ్వజమెత్తారు. ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి మాస్టర్ ప్లాన్ లో ఆ భూములను కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ గా మార్చి భారీ స్కాంకు తెరలేపారన్నారు. ఇండస్ట్రియల్ జోన్ ను కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ గా మార్చాలంటే వాటికి కొన్ని పరిమితులు, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని, వాటన్నింటినీ తుంగలో తొక్కి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పెద్దలే భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు.

గతంలో ఇచ్చిన మాస్టర్ ప్లాన్ కు పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వినిపించిన రైతులు, స్థానిక ప్రజలను మభ్య పెట్టి, ఇంద్రకరణ్ రెడ్డి ఆ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నామని ప్రకటించి తిరిగి అదే తరహాలో మళ్లీ కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందించడం సరికాదని హెచ్చరించారు. గ్రీన్ జోన్ లో చెరువులు, పంట పొలాలు, చెట్లు ఉన్నాయి.. వాటిని పూర్తిగా ఇండస్ట్రియల్ జోన్ పరిధిలోకి తేవడంతో రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ కొత్త మాస్టర్ ప్లాన్ వలన రైతులు అనేక మంది స్థానిక ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని, వారి పక్షాన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమం చేపడతామని తెలిపారు. నిర్మల్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్, మల్లికార్జున్ రెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, కమల్ నయన్, సాదం అరవింద్, భూపతి రెడ్డి, వొడిసెల అర్జున్, నాయుడి మురళి, గాదె విలాస్,
శ్రీరామోజు నరేష్, ప్రజొత్ రావ్, భారత్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement