ఆంధ్రప్రభ బ్యూరో అదిలాబాద్ : వరుస రాజీనామాలు, వలసలు బీఆర్ఎస్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. మాజీ మంత్రి జోగు రామన్నకు ప్రధాన అనుచరులుగా ఉన్న వార్డు నెంబర్ (36) రవీంద్ర నగర్ కాలనీ కౌన్సిలర్ గండ్రత్ రాజేందర్, వార్డు నెంబర్ 2 మహాలక్ష్మి వాడ చిలుకూరి నగర్ కౌన్సిలర్ సంద నర్సింగ్, దీపాయిగూడ కు చెందిన సీనియర్ నాయకులు బండారి చిన్నయ్య గులాబీ పార్టీకి గుడుబై చెప్పి బుధవారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీనియర్లతో పాటు ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు వెంకన్న సాయి ప్రణయ్, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, లక్ష్మణ్, తదితరులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు సీనియర్ కౌన్సిలర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం చర్చినీయాంశమైంది.
అవిశ్వాసం అలజడి…
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పై అవిశ్వాసానికి తెరలేచింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కు చెందిన 34 మంది అవిశ్వాసానికి రహస్యంగా సంతకాలు పెట్టి కలెక్టర్ కు నోటీసు ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలిసింది. అయితే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ పరిణామాలపై చర్చించి వైస్ చైర్మన్ తో పాటు మున్సిపల్ చైర్మన్ పై కూడా అవిశ్వాసానికి పావులు కలుపుతున్నట్టు బీజేపీలో చర్చ సాగుతోంది. రెండు రోజుల్లో అవిశ్వాసాలపై పార్టీ నేతల అభిప్రాయం వెల్లడి కానుంది.