ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన జైనథ్ మండలం నిరాల సమీపంలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న వెంటనే స్పందించారు. క్షతగాత్రులను తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మరికొందరు బాధితులను అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదం కారణంగా రహదారిపై పెద్దఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ ప్రేమేందర్ పరిస్థితిని పర్యవేక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.