ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్) ఆదిలాబాద్ లోక్‌సభ టికెట్టు వలస నేత గొడెం నగేస్కు కేటాయించడంపై అసంతృప్తితో రగిలిపోతున్న సోయం బాపూరావు కదలికలపై బీజేపీ అధిష్టానం నిఘా పెట్టింది. ఆయన కాంగ్రెస్‌లోకి జంప్ అవుతారనే వార్తలు రావడంతో పార్టీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. మంతనాలు సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి కిషన్ రెడ్డి సోయంకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని గంటసేపు చర్చించినట్టు సమాచారం. ఆదివాసీల ఓటు బ్యాంకు, వ్యక్తిగత ప్రాబల్యం మేరకే 2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి గొడెం నగేష్‌ను ఓడించానని, ఈసారి తన చేతిలో ఓడిన వ్యక్తికే టిక్కెట్ ఎలా ఇస్తారని ఈ సందర్భంగా సోయం కిషన్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది.
అసహనం వ్యక్తం చేసిన సోయం..
బీజేపీ అంతర్గత రాజకీయాలపై ఒకింత సోయం అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా, పార్టీ రాష్ట చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలగజేసుకొని తప్పని పరిస్థితుల్లో అధిష్టానం టికెట్టు మార్చిందని, గొడెం నగేష్‌తో కలిసి ప్రచారం చేయాలని చెప్పారు. కేంద్రంలో కీలకమైన నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ వీడి కాంగ్రెస్‌కి చేరవద్దని అభ్యర్థించడంతో సోయం కాస్త చల్లబడినట్టు తెలిసింది. కిషన్ రెడ్డితో నెరపిన సయోధ్య మేరకు పార్టీ అగ్ర నేతలు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ ముందు నామినేటెడ్ పోస్టుపై స్పష్టమైన హామీ ఇప్పించాలని సోయం మెలిక పెట్టారు.
డీల్ ఓకే.. ఢిల్లీకి పోదాం..
ఈ డీల్‌కు సమ్మతించిన కిషన్ రెడ్డి నాలుగైదు రోజుల్లో ఢిల్లీకి తీసుకెళ్లి పార్టీ పెద్దల ముందు నామినేటెడ్ పదవి హామీ ఇప్పించేందుకు సయోధ్య కుదిర్చినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ ఫోన్లో సోయంను బుజ్జగించే యత్నం చేశారు. తిరిగి కిషన్ రెడ్డి నామినేటెడ్ పదవి ఆఫర్‌తో మంతనాలు సాగించడo చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఆంధ్రప్రభ సోయం బాపూరావును వివరణ కోరగా.. ఇప్పటికైతే కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నారని, తాను పార్టీ వీడడం లేదని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నగేష్ తరఫున ప్రచారం చేసే విషయంలో రెండు మూడు రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుంటానని బాపూరావు సమాధానం ఇచ్చారు.