బ్యాంకులలో భద్రతపై ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని బెల్లంపల్లి ఏసీపి ఎడ్ల మహేష్ అన్నారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏసీపీ మహేష్.. బ్యాంకు మేనేజర్ లకు బ్యాంకులో భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకుల పట్ల భద్రత గురించి ప్రజల్లో కూడా ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. బ్యాంకు పరిశరాల్లో సీసీ కెమెరాలు తప్పక అమర్చుకోవాలని ఈ సందర్భంగా ఏసీపీ సూచించారు. వీటికి మూడు నెలల బ్యాక్ అప్ ఉండాలన్నారు. రాత్రి పూట దృశ్యాలను చిత్రీకరించే నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేయాలి సెన్సర్‌తో కూడిన అలారమ్ సిస్టమ్‌ను అమర్చుకోవాలన్నారు.
ప్రతి బ్యాంక్, ఎటిఎం వద్ద రెండు షిప్టులలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విధంగా సెక్యూరిటీ గార్డులు శిక్షణ పొందాలన్నారు. బ్యాంకు ఓపెన్ సమయంలో, మూసిన తరువాత అనుమానిత వ్యక్తులు ఆ ప్రాంతంలో తిరిగినట్లు కనబడిన పోలీసు శాఖకి సమాచారం తెలియజేయాలని సూచించారు. నగదు, బంగారు ఆభరణాలు బ్యాంక్‌లో భద్రపరిచినప్పుడు వాటికి ఏ విధంగా భద్రతా చర్యలు తీసుకోవాలనే విషయంపై రిజర్వూ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొన్ని మార్గదర్శకాలను సూచించిందన్నారు. ఆర్‌బిఐ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. బ్యాంకు లోపల స్ట్రాంగ్ రూమూలలో తరుచు చెక్ చేస్తూ ఉండాలని తెలిపారు.