ఆంధ్రప్రభ బ్యూరో.. ఆదిలాబాద్: త్యాగానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో భక్తి శ్రద్దల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానం సామూహిక ప్రార్థనలతో కిక్కిరిసిపోయింది. ప్రధాన రహదారిపై కూడా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించగా మత గురువు ఇమామ్ బక్రీద్ పండగ ప్రాశస్త్యాన్ని, సమాజంలో నైతిక విలువలు, శాంతి సామరస్యాన్ని ప్రబోధించారు. తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు చేపట్టి పండగ సందర్భంగా దీక్షలు విరమించారు.
సామాన్యులతో కలిసి ఎస్పీ సామూహిక ప్రార్ధనలు..
ఈద్గా మైదానంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ముస్లిం సోదరుల మధ్య కలిసి ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ అలం (ఐపీఎస్) సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. అక్కడ కలిసిన ప్రతి ఒక్కరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. శాంతి సహజీవనం అలవర్చుకోవాలని ఎస్పీ హితబోధ చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, ఆయా పార్టీల నాయకులు పండుగ సందర్భంగా ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్పీని అభినందించిన పోలీసు అధికారులు..
ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల లోక్ సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్పీకి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఆదిలాబాద్ డీఎస్పి ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా సేవలందించి జిల్లాకు ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టిన ఎస్పీ గౌస్ అలoను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ పోతారం శ్రీనివాస్, సిఐలు సత్యనారాయణ, అశోక్, నాయక్ తదితరులున్నారు.