ఆదిలాబాద్, తాంసి: మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ను సస్పెండ్ చేసినట్లు ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తా తెలిపారు. సోమవారం పాఠశాలను పీఓ ఆకస్మికంగా తనిఖీ చేయగా ఆ సమయంలో పాఠశాలలో విధుల్లో ఉండాల్సిన కమాటి, వాచ్‌మెన్ మహేందర్, విజయ్ అందుబాటులో లేకపోవడంతో వారిపై మండిపడ్డారు. పదో తరగతి గదిలో విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేసవి ప్రారంభమైనా ఫ్యాన్‌లు తిరగకపోవడంతో సంబంధిత అధికారి పై మండిపడ్డారు. వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ మరో ఇద్దరికి (మహేందర్, విజయ్) షోకాజ్ నోటీసులు ఇస్తూ ఐటీడీఏ డీడీ కి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం విద్యార్థులను మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బోధన వ్యవహారాలను నిశితంగా పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.