జన్నారం, జులై 31 (ప్రభ న్యూస్): ఢిల్లీలోని ఎర్రకోటలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ హైస్కూల్ విద్యార్థి రాథోడ్ విష్ణువర్ధన్ కు ఆహ్వానం వచ్చింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ ప్రేరణ పోటీలు గత ఏప్రిల్ 9,10 తేదీల్లో ఇంటర్ ప్రభుత్వ కేంద్రీయ విద్యాలయాలకు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీ నిర్వహించారు.
ఆ పోటీల్లో మండలంలోని కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి విష్ణువర్ధన్ ఎంపికయ్యారు. అనంతరం ఆ విద్యార్థి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని యావత్తు తెలంగాణ రాష్ట్రం నుండి బాలుర విభాగంలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో నిర్వహించిన జాతీయ విద్యాసదస్సుకు ఎంపికై, జులై 27 నుండి ఆగస్టు 3 వరకు ఆ సదస్సులో పాల్గొనే అవకాశం పొందాడు. ఆ విద్యార్థి ఢిల్లీ ఎర్రకోటలో ఆగస్టు 15న జరిగే భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ మేరకు ఆ విద్యార్థికి ఆహ్వాన లేఖ బుధవారం పాఠశాలకు వచ్చింది.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్.ఎం రాజన్న, సీనియర్ ఉపాధ్యాయుడు దముక కమలాకర్ మాట్లాడుతూ…. తమ పాఠశాల విద్యార్థికి వచ్చే స్వాతంత్ర వేడుకల్లో ఎర్రకోటలో పాల్గొనడానికి ఆహ్వానం రావడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. మారుమూల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో గల్లీ నుండి ఢిల్లీ వరకు పేరు తెస్తున్న విద్యార్థికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, సెక్టోరియల్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, మండల విద్యాధికారి విజయ్ కుమార్, ఏఏపీసీ చైర్మన్ మంగ, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు.