ఆదిలాబాద్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ, ఏజేన్సీ సంఘాలు ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి..
దీంతో తుడుం దెబ్బ, ఏజెన్సీ నాయకులు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక బంద్ నేపథ్యంలో దుకాణాలు తెరచుకోలేదు.జీవో 3ను యథావిధిగా కొనసాగించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేశ్ డిమాండ్ చేశారు.
వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా ఏజెన్సీ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాగా, ఎస్టీ జాబితా నుంచి లంబాడీ సామాజికవర్గాన్ని తొలగించి అడవి తల్లిపై ఆధారపడి జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని ఆదివాసులకు ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
ఇతర రాష్ర్టాలలో బీసీ, ఎస్సీగా ఉన్న ఆ సామాజికవర్గం, తెలంగాణలో ఎస్టీ జాబితాలో కొనసాగుతుండటం వల్ల ఆదివాసీలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఎస్టీ వర్గీకరణతోనే రాష్ట్రంలో ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ సంఘాలు పేర్కొంటున్నాయి. సుప్రీం తీర్పును అనుసరించి ఎస్టీ జాబితాలోని తెగలను జనాభా ప్రకారం లెక్కించి వర్గీకరించాలని కోరుతున్నాయి.