Monday, November 18, 2024

ADB: హిందూ సంఘాల ఆదిలాబాద్ బంద్ ప్రశాంతం..

దేశభక్తి చాటు చెప్పిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ..
ఆంధ్రప్రభ బ్యూరో, ఆదిలాబాద్ : బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక దాడులు, అరాచకాలను నిరసిస్తూ ఆదిలాబాద్ లో హిందూ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మంగళవారం ప్రశాంతంగా సాగింది. ఆదిలాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వర్తక వాణిజ్య దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ పాటించి హిందూ సంఘాలకు మద్దతు పలికాయి. ఏబీవీపీ, హిందూ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్, హిందూసేన, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంగా శాంతి ర్యాలీ నిర్వహించి దుకాణాలను బంద్ చేయించారు.

బంగ్లాదేశ్ దాడులను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని డిమాండ్ చేశారు. హిందూ విద్రోహశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ బంద్ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాళ్ల బండి మహేందర్, గండ్రత్ సంతోష్, పద్మావార్ రాకేష్, మనోజ్ పవార్, సాయి కృష్ణ, లాలా మున్నా, నరేందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా ర్యాలీ..
ఆదిలాబాద్ పట్టణంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పాఠశాల చిన్నారులు జాతీయ పతాకాన్ని చేత పట్టుకొని దేశభక్తి నినాదాలతో ముందుకు సాగగా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ నేతలు సైతం పట్టణ పురవీధుల గుండా ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

- Advertisement -

భారత్ మాతాకీ జై… నినాదాలు మిన్నంటాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోడీ ప్రతి ఇంటిపై మూడు రోజులపాటు జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారని ఎమ్మెల్యే అన్నారు. జాతీయ భావాలను విద్యార్థుల్లో నూరిపోసేందుకు ఈ ర్యాలీ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్, కృష్ణ యాదవ్, యు రఘుపతి, బోయర్ విజయ్, ఆదినాథ్, ధోని జ్యోతి, శ్రీనివాస్ ముకుంద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement