Tuesday, November 26, 2024

Adb: బతుకమ్మ చీరలను బహిష్కరించిన మహిళలు..


కాసిపేట, అక్టోబర్ 17(ఆంధ్రప్రభ) బతుకమ్మ చీరలు తీసుకోకుండా మహిళలు బహిష్కరించారు. కంపు వాసన వస్తున్న పాత చీరలనే అందిస్తున్నారని ఆరోపణలతో వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. గురువారం కాసిపేట మండల కేంద్రంలోని కాసిపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఐకేపి ఆద్వర్యంలో సిబ్బంది, ఎస్ హెచ్ జి సభ్యులకు బతుకమ్మ చీరల కార్యక్రమం ఏర్పాటు చేశారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణి చేయాల్సిన చీరలను, ఆలస్యంగానైన అందివస్తున్నాయని, గతం కంటే మెరుగ్గా ఉంటాయని ఆనందంతో వచ్చిన మహిళలకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఐకేపి సిబ్బంది, చీరలు అందించేందుకు మూట విప్పగా దుర్వాసన రావడం, గత ప్రభుత్వంలో మిగిలిన చీరలకు కాంగ్రెస్ ప్రభుత్వం లేబుల్ తో వుండడం గమనించిన మహిళలు వాటిని తీసుకోడానికి నిరాకరించడంతో సిబ్బంది ఖంగుతిన్నారు. మురుగు వాసన చీరలు మాకు ఎందుకు, మేము ఏమైనా అడుక్కుంటున్నామా, ఎవరు ఈయమన్నారు,అంటూ మండిపడుతూ , చీరలను తీసుకోకుండా వెనక్కి వెళ్ళారు. దీంతో అధికారులు,నాయకులు చీరల పంపిణి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. మహిళల నిరసనలతో మండల వ్యాప్తంగా జరగాల్సిన పంపిణి కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేయడం గమనార్హం. కాగా ఐకేపి ఎపిఓ వెంకటేశ్ ను సంప్రదించగా, మండలానికి బతుకమ్మ చీరల పంపిణీ కోసమని 10 770 వచ్చాయని, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చీరలు పంపిణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు తెలియచేశారు. కాసిపేట పంచాయతీ లో మహిళలు చీరలు తీసుకోలేదనీ స్పష్టం చేశారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement