Friday, November 22, 2024

Adb:కృషి పట్టుదల ఉంటే ఏదైనా.. ఎఎంవీఐ సొంతం..


3 యూనిఫాం సర్వీసు ఉద్యోగులకు ఎంపిక
జన్నారం,అక్టోబర్14(ఆంధ్రప్రభ): కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని ఓ మహాకవి పాట రాసిన చందంగా.కృషి,పట్టుదల ఉంటే సాధించలేనిదంటూఉండదని నిరూపించారు.3 యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలను కైవసం చేసుకుని,చివరకు రాష్ట్ర రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరుగా ఎంపికైన బేర పృథ్వీరాజ్ వర్మ.అతను మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కన్నెపల్లికి చెందిన బేర రాజమౌళి, శ్రావణి దంపతుల పెద్ద కుమారుడు. పృధ్విరాజ్ వర్మ చిన్నప్పట్నుంచి మంచి మార్కులతో చక్కగా చదువుకుంటూ యూనిఫామ్ సర్వీసులొ ఉద్యోగం చేయాలని సదుద్దేశంతో 3 యూనిఫామ్ ఉద్యోగాలు సాధించారు.అతను ప్రస్తుతం జన్నారం మండలంలోని ఇందనపల్లిలో నివాసముంటూ నిర్మల్ జిల్లా ఉడుంపూర్ రేంజులోని రాంపూర్ లో అటవీ బీటాధికారిగా పనిచేస్తున్నారు.

అతని తమ్ముడు బేర భరద్వాజ్ వర్మ జగిత్యాల జిల్లా రాష్ట్ర రోడ్డు,భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా ఇటీవల ఉద్యోగంలో చేరి పనిచేస్తున్నారు.పృధ్వీరాజ్ ఒకటి నుంచి 10వ తరగతి వరకు లక్షెట్టిపేటలోని ట్రినిటీ హైస్కూల్లో, ఆ తర్వాత వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ పూర్తిచేశారు.2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసరుగాను, 2023లొ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు కానిస్టేబుల్ గాను ఎంపికయ్యారు.అతను 2023 జులై 28న టీఎస్పీఎస్సీ పరీక్ష రాయగా,తాజాగా ఫలితాలను ప్రకటిస్తూ ఈనెల10న జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టారు.అందులో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు, మల్టీజోనులో 2వ ర్యాంకు పొంది, రాష్ట్ర రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరుగా ఉద్యోగం సాధించారు.ఈ మేరకు ఉద్యోగ నియామక పత్రాన్ని అతను అందుకోనున్నారు.ప్రస్తుతం పనిచేస్తున్న అటవీ బీటాధికారి ఉద్యోగానికి రాజీనామా చేయనున్నారు.ఆయన మాట్లాడుతూ,అటవీ శాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు.ఈ సందర్భంగా అతన్ని మిత్రులు, శ్రేయోభిలాషులు,బంధువులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement