వర్షాలు జోరందుకోవడంతో పాముల బెడద అధికమయ్యింది. పాము కాటు బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిర్మల్ జిల్లా ముధోల్ మండలానికి చెందిన ఇద్దరు మహిళలు పాము కాటు బారిన పడి తీవ్ర అస్వస్థత చెందారు. మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన లక్ష్మీ (40) ఇవ్వాల (గురువారం) వేకువ జామున అలుకు చల్లేందుకు ఇంటి ఆవరణలో బోర్లవేసి ఉన్న బకెట్ ను తీయగా.. దాని కిందనున్న పాము ఒక్కసారిగా ఆమె చేయికి కాటు వేసింది.
ఇక.. పిప్రి గ్రామానికి చెందిన ముత్తవ్వ (51) ఉదయం వేళ సోయా చేనులో కలుపు తీస్తుండగా అక్కడ ఉన్న పాము ఆమె చేతి వేలుకి కాటు వేసింది. బాధితులిద్దరిని కుటుంబ సభ్యులు హుటహూటిన బైంసా ఏరియా అసుపత్రి తరలించి చికిత్స అందించారు. వారిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రమాదమేమీ లేదని, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.