Friday, October 18, 2024

TG | నేరరహిత సమాజమే ధ్యేయంగా కృషి చేయాలి : కమీషనర్ సుధీర్ బాబు

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అదనపు డీసీపీలు, ఎసిపిలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో కమిషనర్ సుధీర్ బాబు నేరేడ్‌మెట్ లోని కమీషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ….

రాచకొండ పరిధిలో జరిగే నేరాలను అరికట్టాలని, నేరస్తులను పట్టుకోవటంలో, నేరపరిశోధనలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీటీవీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను వెంటాడి పట్టుకోవాలని ఆదేశించారు.

రాచకొండ పరిధిలోని పాత నేరస్తుల కదలికల మీద నిఘా వేసి ఉంచాలని, వారు మళ్ళీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమ సమస్యలతో స్టేషన్ కు వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా నడుచుకోవాలని, విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని, ఫుట్ పెట్రోలింగ్ ను మరింత ముమ్మరం చేయాలని, సైకిల్ ద్వారా కూడా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.

ఉన్నతాధికారులు తమ పరిధిలో ఉండే స్టేషన్లను క్రమం తప్పకుండా చెక్ చేయాలని, సమర్థవంతంగా పనిచేసే అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక నైపుణ్యం, ఆసక్తి, అనుభవం ఉన్న వారికి ఆయా విభాగాల్లో పని చేసేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు.

ముఖ్యంగా సివిల్ వివాదాలలో పోలీసులు పాల్గొనకూడదు అన్నారు. తమ విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా, జవాబుదారీతనంతో ఉండాలని, చట్టపరిధిలోనే పనిచేయాలని, దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా నేర పరిశోధన జరగాలని, గరిష్ట శిక్షారేటు సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరస్థులు తప్పించుకోవడానికి వీలు లేని విధంగా విచారణాధికారులు, కోర్టు మానిటరింగ్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

త్వరితగతిన కేసుల దర్యాఫ్తు పూర్తి చేయాలని, నేరస్తులకు గరిష్ఠశిక్ష పడేలా బలమైన సాక్ష్యాధారాలను సేకరించాలని సూచించారు. మహిళలు, చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠిన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రమాద విశ్లేషణ, నివారణ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.డ్రగ్స్ సరఫరా వినియోగం మీద ఉక్కుపాదం మోపాలని, కేవలం ఎస్ఓటీ బృందాలు మాత్రమే కాకుండా గతంలో ఎస్ఓటీలో పనిచేసిన అనుభవం ఉన్న అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలను అరికట్టడం తమ బాధ్యతగా భావించాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

రైతులు నష్టపోకుండా కల్తీ విత్తనాలను అరికట్టాలని, అటువంటి దుకాణాల మీద దాడులు చేయాలని సూచించారు.డిజిటల్ యుగంలో పెరుగుతున్న,సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాల ద్వారా బాధితులు కోల్పోయిన డబ్బు మొత్తం రికవరీ అయ్యేలా పని చేయాలని సూచించారు.

ప్రజలను సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్, డీసీపీ ఎల్ బి నగర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డీసీపీ ఎస్బి కరుణాకర్, డీసీపీ క్రైం అరవింద్ బాబు, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్ది, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement