Friday, November 22, 2024

7నుంచి 1గం వరకు సడలింపు

బైంసా : ఆంక్షల సడలింపుతో బయటికి వచ్చారు జనం. భైంసాలో 144 సెక్షన్ ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు. అయితే ఆంక్షల సడలింపుతో జనాలు నిత్యావసర సరుకుల కోసం బయటకు వచ్చారు. ఆర్టీసీ బస్సులు కూడా పాక్షికంగా నడుస్తున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటి వరకు 28 కేసులు నమోదు చేసి.. 45 మంది నిందితులను అరెస్టు చేశారు. మరో 29మంది నిందితులు పరారీలో ఉన్నారు. 66 మందిని బైండోవర్ చేశారు. నిర్మల్‌ జిల్లా భైంసాలో అల్లర్ల నేపథ్యంలో విధించిన ఆంక్షలను 4 గంటల పాటు సడలించారు. 144 సెక్షన్‌ విధింపు కారణంగా ఆరు రోజులుగా ఇళ్లకే పరిమితమైన జనం ఎలాంటి కొనుగోళ్లు చేపట్టలేకపోయారు. నిత్యావసరాలు నిండుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు 144 సెక్షన్‌ను అధికారులు సడలించారు. దీంతో రోడ్లపైకి వచ్చిన జనం నిత్యావసర సరుకుల కోసం ఎగబడ్డారు. సోమవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు సడలింపు కొనసాగుతుందని పోలీసు అధికారులు వెల్లడించారు. అల్లర్ల నేపథ్యంలో మూడో రోజూ నిర్మల్‌ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. దీంతో జేఈఈ రాసే విద్యార్థులు ప్రిపరేషన్‌ కోసం నిర్మల్‌ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఆన్‌లైన్‌ ద్వారా కోచింగ్‌ తీసుకుంటున్న వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల ను సమీప జిల్లాలకు తీసుకువెళ్లక తప్పలేదు. సమయానికి ఏటీఎంలు కూడా పని చేయకపోవడంతో నగదుకు కటకటలాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement