Sunday, November 3, 2024

Followup: ఆదిలాబాద్‌లో ఐటీ పార్కు.. ఐటీ హబ్ కోసం 1.50 కోట్లు ఇస్తాం: కేటీఆర్‌

ఉమ్మడి ఆదిలాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: ఆదిలాబాద్‌లో జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌ ఆధునీకరణ కోసం రూ. 1.50 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. పదిరోజుల క్రితం ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి మరణించిన నేపథ్యంలో సోమవారం ఆయనను పరామర్శించడానికి వచ్చిన కేటిఆర్‌ ఈ కార్యక్రమానంతరం బీడీఎన్‌టీ ఐటీ కంపెనీ ఉద్యోగులతో మాటామంతీ చేశారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన పైవిధంగా స్పందించారు. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులను సద్వినియోగం చేసుకుని ఐటి హబ్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు అప్పజెప్పారు. ఆదిలాబాద్‌లో ఉద్యోగావకాశాలు కల్పించే సిసిఐ మూతపడటంతో ఇక్కడ విపరీతమైన నిరుద్యోగ సమస్య ఏర్పడిందని, ప్రత్యామ్నాయంగా ఐటి హబ్‌కావాలని స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న అభ్యర్థన మేరకే ఆదిలాబాద్‌లో హబ్‌ ఏర్పాటు చేశామని అన్నారు.

త్వరలో ఒక ఐటీపార్కును కూడ ఏర్పాటు చేస్తామని కేటిఆర్‌ హామీ ఇచ్చారు. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఆదిలాబాద్‌ జిల్లా ఇప్పుడు ఐటీ హబ్‌ను ఏర్పాటు చేసుకుని అభివృద్ది పథంలో పరుగెత్తడం సంతోషంగా ఉందని అన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాలైన వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండలో ఉన్న విద్యార్థుల టాలెంట్‌ను వెలికితీయడానికే రూరల్‌ టెక్నాలజీ పేరట సీఎం కేసీఆర్‌ ఐటి హబ్‌ ఏర్పాటుకు ప్రోత్సహించాలన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ప్లంగ్‌ అండ్‌ ప్లే సిస్టం అడ్వాన్స్‌ స్టేజ్‌లో ఉండటం సంతోషకరమన్నారు. ఆదిలాబాద్‌లో బీడీఎన్‌టీ ఉద్యోగులతో ముచ్చటించిన తర్వాత ఇక్కడివారు దేశ విదేశాల్లో పనిచేసే వారికి ఏమాత్రం తీసిపోకుండా పని చేయగలుగుతారనే నమ్మకం వచ్చిందన్నారు. కార్యక్రమంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.

జోగు రామన్నకు పరామర్శ..

మాతృ వినియోగంతో బాధలో ఉన్న ఎమ్మెల్యే జోగు రామన్నను మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. ఆదిలాబాద్‌లోని దీపాయిగూడలోని జోగు రామన్న నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌ జోగు బోజమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. జోగురామన్నను పరామర్శించిన వారిలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement