మంచిర్యాల : సింగరేణి సంస్థ తను విధించుకున్న వార్షిక ఉత్పత్తి లక్ష్యానికి దూరంగా నిలిచింది. కరోనా నేపథ్యంలో బొగ్గు వెలికితీత పనులకు ఆటంకం కలగడంతో గత 20 సంవత్సరాలుగా రికార్డును తిరగ రాసుకుంటున్న సంస్థ తిరోగమనంలో పయనించే పరిస్థితులు నెలకొన్నాయి. గత దశాబ్దంతో పోల్చుకుంటే ఎన్నడు లేని విధంగా 2020-21 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి ఆటంకం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. పక్షం రోజులు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో తన వార్షిక ఉత్పత్తి లక్ష్యమైన 703.5లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి సుదూర దూరంలో నిలిచి ఉంది. లాక్‌డౌన్ నేపథ్యంలో మూడు నెలల కాలం భూ గర్భ గనుల్లో లేఆఫ్ ప్రకటించడంతో ఉత్పత్తి దిగజారిపోయింది. ఇప్పటి వరకు ఫిబ్రవరి మాసాంతం వరకు 70 శాతమే ఉత్పత్తి లక్ష్యానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. 2009 సంవత్సరం తర్వాత ఉత్పత్తిలో వెనుక పడిపోవడం ఈ ఆర్థిక సంవత్సరంతోనే జరుగుతోంది. ఇంకా పక్షం రోజుల గడువు ఉండటంతో ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు సంస్థ శతవిధాలుగా ప్రయత్నాలను సాగిస్తోంది. హాజరు శాతాన్ని పెంచి భూగర్భ గనులతో పాటు ఉపరితల గనుల్లో ఆ మేరకు ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరి మాసాంతం వరకు 22 శాతం లోటుతో ఉత్పత్తి లక్ష్యానికి దూరంగా నిలిచింది. రోజుకు 2లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తే తప్ప ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి చేరువలో వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా నేపథ్యంలో గనుల్లో లేఆఫ్ ప్రకటించిన నేపథ్యంలో ఉత్పత్తికి విఘాతం కల్గింది. కరోనా మలిదఫా విజృంభనతో ప్రస్తుతం పూర్తిస్థాయిలో కార్మికులు హాజరు కావడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో వార్షిక లక్ష్యానికి చేరుకోవడం సింగరేణి సంస్థకు గగనంగానే మారుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement