మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం మిర్చి పంట అత్యధికంగా సాగు అవుతోంది. మండలంలోని రాంపూర్ గ్రామం నాణ్యతతో కూడిన మిర్చీ పంటకు కేంద్రంగా మారింది. దశాబ్దాలుగా ఈ గ్రామ రైతాంగం మిర్చీ పంటనే అత్యధికంగా సాగు చేస్తున్నారు. పంటకు అనుకూలమైన సారవంతమైన నేలలు ఉండటంతో పాటు నాణ్యతలో మేటిగా ఉండటంతో డిమాండ్ ఉండి అత్యధికంగా రాబడిని రైతాంగం పొందుతున్నారు. గోదావరి తీర ప్రాంతం కావడంతో ఈ గ్రామం నల్లరేగడి, ఒండ్రు నేలలతో విస్తరించింది. గత 20 సంవత్సరాలుగా ఈ గ్రామంలోని రైతాంగం అత్యధికంగా విరపపంటనే సాగు చేస్తున్నారు. సుమారు 600 ఎకరాల్లో 300 కుటుంబాలు ఈ పంటను సాగు చేపడుతున్నారు. మండలంలో వేయ్యి ఎకరాల్లో పంట సాగు అవుతుండగా అత్యధికంగా రాంపూర్ గ్రామంలోనే సాగు అవుతోంది. జిల్లా వ్యాప్తంగా చెన్నూరు మండలంలో 400 ఎకరాల్లో, జైపూర్‌లో 200 ఎకరాలు, లక్షెట్టిపేట, దండేపల్లిలో వందల ఎకరాల్లో సాగు అవుతుండగా కోటపల్లి మండలంలో అత్యధికంగా 1200 ఎకరాల్లో మిరపపంటను సాగు చేస్తున్నారు. ఈ మండలంలోని రాంపూర్‌తో పాటు కొల్లూరు, దేవులవాడ, అన్నారం గ్రామాల్లో ఈ పంట సాగు అవుతోంది. దశాబ్దాల తరబడి పంట సాగు చేస్తుండటంతో రైతాంగం సాగులో వినూత్న పద్దతులను ఆచరిస్తూ పంటకు అనుకూలంగా ఎరువులు వాడటంతో పాటు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మందుల పిచ్‌కారీ చేస్తున్నారు. నాణ్యతతో కూడిన పంట కావడంతో ఈ గ్రామాలకే వచ్చి వ్యాపారులు పంటను కొనుగోలు చేస్తుంటారు. మిర్చి పంట దీర్ఘకాలిక పంట. సుమారు 9 నెలల పాటు రైతులు శ్రమించాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు రూ.1లక్ష నుండి రూ.2లక్షల వరకు రైతులు ఆధాయం పొందుతున్నారు. శ్రమతో కూడుకున్న పంట కావడంతో మిగతా ప్రాంతాల్లో ఈ పంట సాగు వైపు రైతాంగం మొగ్గు చూపడం లేదు. ఈ కోటపల్లి మండలంలో మాత్రం రైతాంగం మిర్చి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. జూన్‌లో మొదలైన పంట మార్చి నెలలో ముగింపు దశకు వస్తుంది. మిరపను పెంచడంతో పాటు వాటిని ఎండబెట్టి మార్కెట్‌కు తరలిస్తుంటారు. శ్రమతో పాటు పెట్టుబడి కూడా అధికంగా ఉంటుంది. దానికి అనుకూలంగానే ఆధాయం కూడా అధికంగా వస్తుండటంతో రైతులు ఈ పంట వైపే మండలంలో మొగ్గు చూపుతున్నారు. ఈ సంవత్సరం మిర్చి పంటకు రేటు బాగా ఉండటంతో రైతులకు అత్యధికంగా ఆధాయం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం మిర్చి క్వింటాల్ ధర రూ.15వేల నుండి రూ.20వేల వరకు పలుకుతుండగా రైతులకు శ్రమకు తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఉండటంతో రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement