Tuesday, November 26, 2024

గైర్హాజరైన ఎంపీటీసీ, సర్పంచులు

భీమిని : భీమిని మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్‌ అధ్యక్షురాలు రాజేశ్వరి-లక్ష్మణ్‌ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ఎవరు రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ రాధాకృష్ణ తెలిపారు. సమావేశం వాయిదా పడటంతో వేసవి కాలం సమీస్తున్న దృష్ట్యా పల్లె గ్రామాల్లో మంచినీటి లోటు ఏర్పడకుండా ఉండటం కోసం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇది ఇలా ఉండగా ప్రతీ మూడు నెలలకు ఒక సారి మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించడంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలను రూపొందించడం కోసం ఎంపీపీ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. భీమిని మండలంలో మాత్రం ఇందుకు బిన్నంగా రెండు సమావేశాలు వాయిదా పడిన తర్వాతే మూడవ సమావేశాన్ని నామమాత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎప్పుడు సమావేశాన్ని నిర్వహించాలి అనే తేదిని నిర్ణయించినా వాయిదా పద్దతి ఉందనే పద్దతిలో సమావేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో సభ్యులు అనుకున్నంత అయింది. సమావేశం వాయిదా పడుతుందిలే అనే మీమాంస రుజువైంది. దీంతో మండలంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. ముఖ్యంగా మండలంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అతి ముఖ్యమైన సమస్య త్రాగునీరు, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వాహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం తదితర అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీటీసీలు, సర్పంచులు సమావేశాలకు రాకపోవడంతో అధికారులు చేసేది ఏమి లేక వాయిదా వేస్తున్నారు. 23 శాఖల అధికారుల్లో 15 నుండి 16 శాఖల అధికారులు సమావేశానికి హాజరై మేము వచ్చాంలే అని అనుకొని వెళ్లిపోతున్నారు. వేసవి కాలంలో ఏర్పడే సమస్యలను అదిగమించడం కోసం నాయకులు, అధికారులు తమవంతు కృషి చేయాల్సింది పోయి ఏమవుతుందిలే అనే మూస దోరణితో సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి సమావేశాలు సక్రమంగా జరగకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మండలం వెనుకంజలో ఉండిపోయింది. ఇలా సమావేశాలను వాయిదా వేస్తున్న నాయకులు అభివృద్దిలో ఒక్కసారైన ఆలోచిస్తే వాధన బలంగా వినిపిస్తోంది. ఇక మూడవ సారి జరిగే సమావేశమైనా సక్రమంగా జరిగి అభివృద్ధి పనులపై చర్చ జరగాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ తదుపరి సమావేశం ఎప్పుడు నిర్వహించేది ఎంపీడీఓ తెలియ పరుస్తారని, జరగబోయే సమావేశానికి 23 శాఖల అధికారులు, అన్ని గ్రామపంచాయితీల సర్పంచులు, ఎంపీటీసీలు హాజరై అభివృద్దికి సహకరించాలని ఎంపీపీ అన్నారు. ఈ సమావేశంలో అధికారులు ఎంఈఓ మహేశ్వర్‌ రెడ్డి, తహశిల్దార్‌ పరమేశ్వర్‌ రెడ్డి, విద్యుత్‌ శాఖ ఏఈ రాంమనోహర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ పోచన్న, ఏఈఓ కార్తిక్‌, హార్టికల్చర్‌ ఏఈఓ సుప్రజ, కోఆప్షన్‌ సభ్యుడు ఆరీఫ్‌, ఏపీఓ భాస్కర్‌రావు, ఎంపీఓ విజయ ప్రసాద్‌, కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement