Friday, November 22, 2024

Adilabad – బీఆర్ఎస్ కు బిగ్ షాక్…! బిజెపిలోకి ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో – (ప్రభ న్యూస్).. ఫిబ్రవరి 3: టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇటీవలే డిసిసిబి చైర్మన్ ఆడ్డి బోజారెడ్డి కాంగ్రెస్ లో చేరిపోగా.. ఊగిసలాట లో ఉన్న
ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. రాథోడ్ జనార్ధన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ సీటు ఆశించగా బీఆర్ఎస్ నుండి చుక్కెదురు కావడంతో అసంతృప్తితో రగులుతున్న ఆయన బీ ఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అదిలాబాద్ పార్లమెంటు టికెట్ కోసం కాంగ్రెస్ లో ప్రయత్నించగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పార్టీలో చేర్చుకోనివ్వకుండా అడ్డుపడడంతో గత్యంతరం లేక బిజెపిలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ టికెట్ కోసం కూడా బిజెపిలో రాథోడ్ ఆశలు పెట్టుకున్నా గోండు అభ్యర్థి వైపు అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం పై కాంగ్రెస్ అవిశ్వాసం ప్రతిపాదిస్తే బిజెపి కి ముగ్గురు జడ్పిటిసిల బలo ఉండడంతో తన పదవిని కాపాడుకునేందుకు బిజెపి గూటికి చేరుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ గొడెం నగేష్ రేపో మాపో బిజెపిలో చేరేందుకు మార్గం సుగమం చేసుకోగా, రాథోడ్ జనార్ధన్ కూడా కమలం గూటికి చేరడం గులాబీ పార్టీకి కోలుకోలేని దెబ్బగా ఆ పార్టీ నేతలు మదన పడుతున్నారు. రానున్న లోక సభ ఎన్నికల నేపథ్యంలో ఆదివాసి, లంబాడా సామాజిక సమతుల్యం కోణంలో బిజెపి ఎత్తులు వేస్తూ ఇరువర్గాల వారినీ గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఉట్నూర్ లో రాథోడ్ ర్యాలీ..
ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ శనివారం మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి ఉట్నూర్లో ర్యాలీ నిర్వహించి వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు రాథోడ్ జనార్ధన్ తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, దేశం కోసం ధర్మం కోసం బిజెపి పనిచేస్తుండడం ప్రధాని నరేంద్ర మోడీ ద్వారానే దేశం సురక్షితంగా ఉంటుందని భావించి ధర్మ పరిరక్షణలో బాధ్యతగా బిజెపిలో చేరుతున్నట్టు తెలిపారు. ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాల నుండి పార్టీ నాయకులు తన అనుచరులు మూకుమ్మడిగా బిజెపిలో చేరుతున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement