Saturday, November 23, 2024

Adilabad Political Scenario – అదిలాబాద్ జిల్లా – ఆదివాసీ ఖిల్లా.. ఆధిప‌త్యమెవ‌వ‌రిదో..

ఉమ్మడి ఆదిలాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2018 ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీకి రానున్న ఎన్నికల్లో కాస్త పోటీ కనిపిస్తోంది. ఎస్టీ నియోజకవర్గాలైన బోథ్‌, ఖానాపూర్‌ సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వరనే విధంగా పలు సందర్భాల్లో కేసీఆర్‌ మాట్లాడటం, ఆసిఫాబాద్‌లోను సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై జనాలకు అందుబాటులో ఉండడనే తీవ్ర విమర్శలున్నాయి. ఇక మిగతా నియోజక వర్గాల్లోనూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ అక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కాస్త పుంజుకోవడంతో రానున్న ఎన్నికల్లో టఫ్‌ ఫైట్‌ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఐకె రెడ్డి ఇలాకాలోనూ ఇటీవలే కాంగ్రెస్‌, బీజేపీల్లో సీనియర్లు వచ్చి చేరడంతో అక్కడ సీన్‌ మారింది.


ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో నిర్మల్‌లో త్రిముఖ పోటీ ఖాయం కానుంది. బీఎస్పీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తొలుత ఆలంపూర్‌ నుంచి పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆయన అభిప్రాయం మారింది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని సిర్పూర్‌-టి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రావడంతో అక్కడ కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు గడ్డు కాలం ఏర్పడింది. 2014 ఎన్నికల్లో అక్కడ బీఎస్పీ పార్టీ తరఫున గెలిచిన కోనేరు కోనప్ప ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. ఆ నియోజక వర్గంలో దళిత, ఆదివాసీ, మైనార్టీ ఓట్లు అత్యధికంగా ఉండటం, ఆ ఎన్నికల్లో వారి ఓట్లన్నీ బీఎస్పీకే పడటంతో అప్పుడు కోనప్ప గెలిచారు. ఆ గెలుపునే ప్రామాణికంగా తీసుకుంటున్న బీఎస్పీ తాజాగా రానున్న ఎన్నికల్లో అక్కడి నుంచే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను రంగంలోకి దించే యోచనలో ఉంది.

మంత్రి ఐకె రెడ్డి ఇలాకాలో సీన్‌ మారింది
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి రెండు దఫాలుగా మంత్రి పదవి చేజిక్కించుకున్న ఐకె రెడ్డికి ఈసారి ఎన్నికల్లో టఫ్‌ ఫైట్‌ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యమ సమయం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటూ, ఒకసారి అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కేసీఆర్‌, కేటీఆర్‌లకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న శ్రీహరిరావ్‌ ఇటీవలే బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో మంత్రి ఐకె రెడ్డి గెలుపునకు ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ఇన్నాళ్లు కాంగ్రెస్‌ పార్టీలో ఉండి పార్టీని తన భుజాలపై నడిపిన ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

బీఎస్పీ ఎంట్రీతో మారిన సిర్పూర్‌ సీన్‌
ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు ఎక్కువగా ఉండే సిర్పూర్‌-టి నియోజక వర్గంలో రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీఎస్పీల మధ్య మాత్రమే పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో తనకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్టు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీఎస్పీ తరఫున పోటీ చేశారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్‌ నుంచి పోటి చేసిన కావేటి సమ్మయ్యపై దాదాపు తొమ్మిది వేల పైచిలుకు ఓట్లతో కోనప్ప గెలుపొందారు. అనంతరం ఆయన బీఎస్పీ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనూ కోనప్ప సిర్పూర్‌లో బీఎస్పీ పార్టీ తరఫున గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆదిలాబాద్‌, ముధోల్‌లో…
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎదుటి పార్టీలలో సరైన నాయకత్వం లేకపోవడం, కొన్ని పార్టీల్లో అభ్యర్థుల సంఖ్య పెరిగిపోవడం లాంటివి గమనిస్తే ఆదిలాబాద్‌, ముధోల్‌ నియోజక వర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్‌ నియోజకవర్గ విషయానికొస్తే గత సంవత్సరకాలంగా బీజేపీ చేసిన ఎక్సైర్‌సైజ్‌ మేరకు ఇక్కడ పార్టీ దాదాపుగా పుంజుకున్నప్పటికీ ఎమ్మెల్యే టికెట్ల కోసం అభ్యర్థుల సంఖ్య పెరిగిపోవడం కూడా ఒక సమస్యగా మారింది. గత పది సంవత్సరాలుగా పార్టీలోనే ఉంటూ రెండు దఫాలుగా సెకండ్‌ పొజిషన్‌లో ఓడిపోయిన పాయల్‌ శంకర్‌కు సానుభూతి ఉంది. ఈ విషయంపై అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలించి సరైన అభ్యర్థికి టికెట్‌ ఇస్తే బీజేపీకి ఎడ్జ్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక కాంగ్రెస్‌ విషయానికొస్తే గత ఎన్నికల్లో పోటీ చేసి తృతీయస్థానంలో నిలిచిన గండ్రత్‌ సుజాతతో పాటు ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కంది శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి సి. రాంచంద్రారెడ్డి అల్లుడు సంజీవరెడ్డి టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో అధిష్టానం పూర్తిగా స్కాన్‌ చేసిన తర్వాత టికెట్‌ ఎవరికి వస్తుందనే దానిపై గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఇక ముధోల్‌ నియోజకవర్గ విషయానికొస్తే అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డిపై పెద్దగా వ్యతిరేకత లేకపోవడం ఆయన విజయానికి సంకేతంగా ఉన్నప్పటికీ, అదే నియోజక వర్గంలో బీజేపీ కాస్త బలమైన పార్టీగా పేరుపొందింది.
అయితే అక్కడ బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన రమాదేవితో పాటు కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చి చేరిన రామారావ్‌ పటేల్‌, మోహన్‌రావ్‌ పటేల్‌లు ఇద్దరూ కూడా బీజేపీ టికెట్‌ ఆశించడంతో అక్కడి ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో ఆ నియోజకవర్గ బీజేపీ టికెట్టు ఇచ్చే విషయం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎడ్‌బిడ్‌ గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ విజయ్‌కుమార్‌ రెడ్డి రంగంలోకి దిగుతున్నప్పటికీ ఆయనకు పెద్దగా పరిచయాలు లేకపోవడం లాంటి అంశాలు అక్కడ కాంగ్రెస్‌ పార్టీకి మైనస్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిగతా సి ట్టింగ్‌ల పరిస్థితి ఇలా..
బోథ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌పై స్వయంగా సీఎం కేసీఆర్‌ పలు దఫాలుగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ గోడం నగేష్‌ లేక ప్రస్తుత నేరడిగొండ జడ్పీటీసీ అనిల్‌ జాదవ్‌లలో ఒకరికి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రస్తుత బీజేపీ ఎంపీ సోయం బాపురావ్‌ కూడా రంగం సిద్ధం చేస్తుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎంపీ సోయం బాపురావ్‌ బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చి బోథ్‌ నియోజకవర్గంలో పోటీ చేస్తే బీఆర్‌ఎస్‌కు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇక ఖానాపూర్‌ విషయానికొస్తే అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని జాన్సన్‌ నాయక్‌కు టికెట్‌ దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా, జాన్సన్‌ నాయక్‌లు ఇద్దరు కూడా స్థానికేతరులు కావడం అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీలోకి దిగనున్న భరత్‌ చౌహన్‌కు ఈ వ్యవహారం ప్లస్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అటు బీజేపీ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్న రాథోడ్‌ రమేశ్‌ కూడా తనదైన ఓటు బ్యాంకు సంపాదించుకోవడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంచిర్యాల నియోజక వర్గ విషయానికొస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యే దివాకర్‌ రావు లేదా ఆయన కొడుకు విజిత్‌ రావ్‌లు ఈసారి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ తరఫున ప్రేంసాగర్‌ రావు పోటీలో ఉంటారు. అటు బీజేపీ నుంచి రఘునాథ్‌, ముల్కల్ల మల్లారెడ్డిలు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా ఈ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉండేలా కనబడుతోంది. చెన్నూరు నియోజకవర్గ విషయానికొస్తే బాల్క సుమన్‌ అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు ప్రాధాన్యత కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసేందుకు డాక్టర్‌ రాజ రమేశ్‌ సిద్ధంగా ఉన్నారు. అయితే ఈయన కొత్త వ్యక్తి కావడంతో ప్రాధాన్యత కనిపించడం లేదు
. బీజేపీ తరఫున గడ్డం వివేక్‌ ఆసక్తి చూపడంతో ఇక్కడ ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బెల్లంపల్లి విషయానికొస్తే అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై పలు ఆరోపణలు రావడం, కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు గడ్డం వినోద్‌ సిద్ధంగా ఉండటంతో అక్కడి పరిణామాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేసిన గడ్డం వినోద్‌ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గ విషయానికొస్తే స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కుపై తీవ్రమైన వ్యతిరేకత ఉండటం అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఇక్కడి టికెట్‌ను తాజా జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎంపీ స్థానంలో పోటీపై ఉత్కంఠ
ఇక ఆదిలాబాద్‌ ఎంపీకీ ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఇప్పటి నుంచే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావ్‌ కాంగ్రెస్‌లోచేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుండటం, ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి బోథ్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించడం లాంటివి అత్యంత చర్చకు దారితీస్తున్నాయి. సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి బోథ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థి ఎవరు? అనే విషయంపై అధిష్టానం ఇప్పటి నుంచే ఆలోచన చేస్తోంది. ఇక గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన గోడం నగేష్‌ కూడా తాజాగా బోథ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానంపై దృష్టి సారించడంతో అటు బీఆర్‌ఎస్‌ పార్టీలోనూ ఎంపీ అభ్యర్థి కరువయ్యాడు. ఇక కాంగ్రెస్‌ పార్టీ నుంచి గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాథోడ్‌ రమేశ్‌ ప్రస్తుతం ఖానాపూర్‌ బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉండటంతో ఆ పార్టీలోనూ ఎంపీ అభ్యర్థి కరువయ్యాడు. మొత్తంగా మూడు పార్టీల్లో నుంచి కూడా ఆదిలాబాద్‌ ఎంపీ స్థానానికి సరైన అభ్యర్థులు లేకపోవడంతో అన్ని పార్టీల అధిష్టానాలు ఆ దిశగా దృష్టిసారించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement