మేటింగ్ గైమ్లో ముక్కోపి..
కాగజ్‌నగర్ డివిజన్లో నలుగురు మృతి
మహారాష్ట్ర అభయారణ్యం నుంచి వలస
నవంబర్ మాసంలో మేటింగ్ కోసం సంచారం
మగపులి తరలివచ్చినట్టు అధికారుల అంచనా
టైగర్స్ ట్రాకింగ్‌లో అటవీ సిబ్బంది వైఫల్యం
పంట చేలోకి వెళ్లాలంటే జంకుతున్న ప్రజలు
భయం గుప్పిట్లో ప్రాణహిత తీర ప్రాంత జనం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : చలికాలం వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఇటు చలితో.. మరోవైపు పులితో గజ గజ వణికిపోతున్నారు. నెల రోజులుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దపులులు, చిరుతపులి సంచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అటవీ ప్రాంతాలను వదిలి పెద్దపులి జనావాసంలోకి రావండతో పల్లె జనాలను కంటిమీద కునుకు లేకుండా పోతోంది. శుక్రవారం కొమురం భీం జిల్లా గన్నారం బేస్ క్యాంపు శివారులో మోర్లె లక్ష్మి (22)ని పత్తి చేనులోనే వెంటాడి వేటాడి చంపిన బెబ్బులి , ఈరోజు ఉదయం కంది చేనుకు వెళ్లిన దుబ్బగూడా గ్రామానికి చెందిన సురేష్ ( 29) అనే రైతుపై హఠాత్తుగా దాడి చేసి మెడపై తీవ్రంగా గాయపరిచింది. ఇప్పటివరకు ఇదే డివిజన్లో నవంబర్ మాసంలోనే మ్యాన్ ఈటర్ నలుగురి ప్రాణాలు తీయడం కలకలం రేపుతోంది.
నవంబర్ మాసంలోనే టైగర్ హల్ చల్..
ప్రాణహిత తీరం అవతలి వైపు మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్, ఇంద్రావతి పులుల అభయారణ్యం నుంచి పెద్ద పులుల వలసలు ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలే ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లోకి నాలుగు పెద్ద పులులు, ఒక చిరుత పులి ప్రవేశించి జనావాసంలో హడలెత్తిస్తున్నాయి. నిన్న లక్ష్మిని చంపేసిన పెద్దపులి 12 కి. మీ. దూరంలోని కంది చేనులో ఉన్న సురేష్ పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. 2020 నవంబర్ 12న దహేగం మండలం దిగడ గ్రామానికి చెందిన విగ్నేష్ (22) , 2022 నవంబర్ 29 న పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన నిర్మల (18) అని యువతిపై పులి దాడి చేసి హతమార్చింది.
ఆడపులి కోసం వెతుకుతూ..
గత ఏడాది నవంబర్ 23న వాంకిడి మండలం ఖానాపూర్ శివారులో సిడం భీము (60) పై టైగర్ పంజా విసిరి చంపేసింది. తాజాగా నిన్న లక్ష్మీ అనే యువతీని పొట్టన పెట్టుకోవడంతో నవంబర్ మాసంలోనే దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ మాసంలో తోడు జత కోసం ఆడ పులి కై వెతుకుతూ బిత్తర చూపులతో సంచరిస్తూ మనుషులు, ఇటు పశువులను వరుసగా పొట్టన పెట్టుకుంటున్నాయి. నవంబర్ లోనే మగ పులులు సంతతి కోసం ఆడపులితో జతకట్టేందుకు మేటింగ్ సీజన్ గా అటవీ అధికారులు పేర్కొంటున్నారు. నవంబర్ డిసెంబర్ మాసాల్లో అటవీ శివారు ప్రాంతాల్లోకి, పంట చెన్లోకి ఒంటరిగా వెళ్లవద్దని చెబుతున్నారు.
పులుల ట్రాకింగ్ లో విఫలం.
పెద్దపులుల కదలికలపై సమాచారం ఇవ్వకుండా, ట్రాకింగ్, పగ్ మార్క్స్ నిర్ధారణలో అటవీ సిబ్బంది విఫలమవుతున్నారు. చేతులు కాలాక.. అన్నచందంగా పెద్దపులి మనుషులపై దాడులు చేస్తేనే అటవీ అధికారులు హడావుడి ప్రదర్శిస్తున్నారు. శనివారం డ్రోన్ కెమెరాలతో సిర్పూర్టి మండలం తో పాటు ప్రాణహిత తీరం వెంబడి నస్రుల్ నగర్, అనుకో డా, కడంబా, బాబాగూడా, ఉడికిలి, నవేగాo, వేంపల్లి ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. 144 సెక్షన్ నిషేధజ్ఞలు అమలు చేశారు.