Friday, November 22, 2024

Adilabad – రైతు బంధా? రాబందా? కరెంటా? కాంగ్రెస్సా? సీఎం కేసీఆర్ ప్రశ్నలు

అదిలాబాద్ – కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా? రైతు బంధు కావాలా? రాబందు కావాలా? ఒక్కసారి ఆలోచించండి, అని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదిలాబాద్ ప్రజలకు సూచించారు. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ముస్లీం, హిందువులు బేధం లేకుండా ఈ సభకు జనం పోటెత్తారు. ఈ సభలో సీఎం కేసీఆర్ ఆద్యంతం బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును వివరించారు.

కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే కలిగే అనర్థాలను స్పష్టం చేశారు. పదిహేనేళ్ల తమ పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని, గత పాలకుల పాలన తీరును బేరీజు వేసుకోవాలని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ నాయకులు చెప్పినట్టే 24 గంటల కరెంటు ఉండదని, రైతు బంధు , రైతుబీమా ఉండవని, ఇది ప్రమాదకర పరిస్థితి అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపుతామని రాహుల్ గాంధీ అంటున్నారని, ఉచిత కరెంటు వల్ల దుబారా జరుగుతోందని, రైతులకు మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, దీంతో తెలంగాణ రాష్ర్టం సర్వనాశనం అవతుందని కేసీఆర్ హెచ్చరించారు.

బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న వల్లనే ఆదిలాబాద్ నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని, ఇప్పటికే తన నియోజకవర్గాన్ని తీర్చి దిద్దారని కేసీఆర్ కితాబు ఇచ్చారు. చెనాక కొరాట బ్యారేజీ పనులు పూర్తి కానున్నాయని, 50 వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ను జోగురామన్య సాధించారని, రైతు బందు , రైతు బీమా కావాలంటే జోగురామన్నను గెలిపించాలని కేసీఆర్ ప్రజలను కోరారు..
తమ పాలనలో ముస్లీంలు, హిందువులు తేడా లేకుండా లౌకిక రాజ్య స్థాపనకే కృషి చేశామని, ముస్లీంల బిడ్డల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు తెరిచామని, ఇంజనీర్లు, డాక్టర్లుగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చామన్నారు.

- Advertisement -

ముస్లీంల పండుగలకు ఈద్ తోఫాలు ఇచ్చామన్నారు. తమ పాలనలో ప్రజలందరూ సమానమేనని, సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ పంచామన్నారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు లేదు. తాగునీరు లేదు. కరెంటు ఎప్పుడు వస్తాదో, పోతాదో తెలీదు, మోటార్లు కాలిపోయేవి.. ఇప్పుడు ఆ సమస్యలు లేవని, కానీ 24 గంటల విద్యుత్తు సరఫరాను నిలిపి వేయాలని కాంగ్రెస్ పట్టుపడుతోందన్నారు. మూడు గంటల కరెంటుతో నీళ్లు పారుతాయా? 10 హెచ్పీ మోటార్లు పెట్టుకోవాలంట, రాష్ర్టంలో 30 లక్షల మోటార్లు ఉన్నాయని, వీటన్నిటీ 10 హెచ్పీగా మార్చటానికి డబ్బులు ఎవరు ఇస్తారు, వాళ్ల అయ్యలు ఇస్తారా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

కత్తి ఒకరికి ఇచ్చి, మరొకరిని యుద్ధం చేయమంటామా? ఒకరి ఓటు వేయాల్సింది మరొకరికి ఓటు వేస్తే అంతా నాశనమే. ఒక్కసారి ఆలోచించండి, ప్రజల పక్షాన పని చేసే పార్టీ కావాలా? దళారులు, పైరవీకారులు, లంచాలు కోరేవాళ్ళు కావాల? తేల్చుకోండి, ప్రభుత్వం మారితే ఐదేళ్ల వరకూ మన మొఖం ఎవరూ చూడరు.. నేను ఎవ్వరినీ ప్రశ్నించలేనని కేసీఆర్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement