ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) – లోక్ సభ ఎన్నికలవేళ వరుస వలసలతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవలే ఆ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, జి విట్టల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిపోగా తాజాగా గులాబీ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలో చేరెందుకు సంసిద్ధత వ్యక్తం చేయగా, కే కేశవరావు ఇంటికి కూడా వెళ్లి చర్చలు జరిపారు.
నిర్మల్ లో కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంద్రకరణ్ రెడ్డి ని పార్టీలో చేర్చుకోవద్దని ఆందోళనలు చేపట్టారు. ఎన్నికలవేళ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇంద్రకరణ్ రెడ్డి ని పార్టీలో చేర్చుకునేందుకు తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షి శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఇంద్రకరణ్ రెడ్డి కే కేశవరావు తో కలిసి శనివారం పార్టీలో చేరే అవకాశం ఉందని, ఆయనతోపాటు మంచిర్యాల జిల్లా బి ఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కూడా తన అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరనున్నారు. వీరిద్దరూ టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కాగా చేరిక విషయమై ఇంద్రకరణ్ రెడ్డి ని ఆంధ్రప్రభ సంప్రదించగా కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని, అంతా కాలమే నిర్ణయిస్తుందని దాటవేశారు.