స్పెషల్ డ్రైవ్ దాడుల్లో నిషేధిత గుట్కా స్థావరాల గుట్టురట్టు..
రెండో రోజు రూ 44.19 లక్షల విలువైన గుట్కా పట్టివేత..
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గుట్కా మత్తు పదార్థాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినా… ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గుట్కా పాన్ మసాలా అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లా ఎస్పీ గౌస్ అలం ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా 24 గంటల వ్యవధిలోనే గోడౌన్లలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన రూ. కోటి 21లక్షల 80 వేల విలువైన గుట్కా సంచులు లభ్యమయ్యాయి.
కర్ణాటక కేంద్రంగా అక్రమ రవాణా….
కర్ణాటకలో గుట్కా అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఉండడంతో వ్యాపారులు సునాయాసంగా కోట్లు సంపాదించే లక్ష్యంతో లారీల కొద్దీ సరుకును ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలోనూ ప్రభుత్వం గుట్కా పాన్ మసాలా మత్తు పదార్థాలను నిషేధించడంతో వ్యాపారులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గోడౌన్లను స్థావరాలుగా మలుచుకుని అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. పట్టణ కేంద్రాల నుండి పల్లెల వరకు గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తూ రెట్టింపు ధరతో విక్రయిస్తూ కోట్లు గడుస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.
రెండో రోజు 44. 19 లక్షల విలువైన గుట్కా పట్టివేత…
జిల్లా ఎస్పీ గౌస్ అలం ఆదేశాల మేరకు ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైమండ్ ట్రాన్స్ పోర్ట్ గోడౌన్ లో అక్రమంగా నిలువ ఉంచిన రూ. 44.19 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. తొలిరోజు ఆదివారం 77 లక్షల 60 వేల విలువైన గుట్కా సంచులు పట్టు పడగా, సోమవారం నల్ప 44.19 లక్షల విలువైన గుట్కా నిల్వలు గుట్టురట్టు కావడం విశేషం. ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగు సరిహద్దున గల మహారాష్ట్రలోని యావత్ మాల్, నాగపూర్, చంద్రపూర్,నాందేడ్ జిల్లాలకు అక్రమ మార్గాల్లో చేరవేస్తూ వ్యాపారం సాగిస్తున్నట్టు తేలింది. పట్టుబడ్డ గుట్కా ప్యాకెట్లలో కర్ణాటకలో 20 బ్రాండ్ల పేరిట ఉత్పత్తి చేసి తెలంగాణ మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. నిందితులు ఎస్.కె రహమతుల్లా, అర్బాజ్ ఖాన్, సైఫుల్ల ఖాన్, షమియుల ఖాన్, పసివుల ఖాన్, సాజిదుల్లా ఖాన్ లను హరీష్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.