Friday, October 25, 2024

Adilabad – తొలిరోజే పత్తి కొనుగోళ్లపై లొల్లి – కొనసాగుతున్న చర్చలు

8 నుండి 12% తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామన్న సిసిఐ.

ఆంధ్రప్రభ స్మార్ట్ , ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ మార్కెట్ లోని ప‌త్తి కొనుగోళ్ల‌లో తొలి రోజే లొల్లి ఏర్ప‌డింది. దీంతో ప‌త్తి కొనుగోళ్లులు ప్ర‌తిష్ఠంభ‌న నెల‌కొంది. పత్తి లో తేమ 8 నుండి 12% లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని భారత కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) మొండికేసింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు పత్తి కొనుగోలు ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ రాజార్శి షా, మార్కెటింగ్ ఆర్జెడి శ్రీనివాస్, సీసీఐ అధికారులు మార్కెట్ యార్డుకు వచ్చారు. అప్పటికే వందలాది పత్తిలోడు తో వాహనాలు మార్కెట్ యార్డ్ కు తరలివచ్చాయి. పత్తిలో తేమశాతం సగటున 17 నుండి 23% ఉండడంతో నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేది లేదని సీసీఐ అధికారులు తేల్చి చెప్పారు. 12 శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని హుకుం జారీ చేశారు. దీంతో రైతుల్లో ఆగ్రహం పెల్లు బుకింది.

నాలుగు గంటల పాటు కలెక్టర్ చర్చలు..
రైతులు, వ్యాపారులతో ఆదిలాబాద్ కలెక్టర్ పలుదాఫాలుగా చర్చలు జరిపినా మధ్యాహ్నం 2.30 గంటల వరకు తేమ శాతం పైనే పేచీ జరిగింది. వ్యాపారులు, అధికారులు ఒక్కటై రైతులను నిండా మోసం చేస్తున్నారని ప‌లువురు రైతులు నిలదీశారు. పంట చేతికి వచ్చేవరకు లక్షలు వెచ్చించినా.. మార్కెట్లో మాత్రం ధర లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేమశాతం పరిగణన‌లోకి తీసుకోకుండా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. బోథ్‌ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ మార్కెట్ యార్డ్ కు చేరుకొని రైతుల నిరసనకు మద్దతు తెలిపారు.

స్తంభించిన పత్తి కొనుగోళ్లు..
జిల్లా కలెక్టర్ రాజార్శి షా రైతులను వ్యాపారులను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ధర విషయంలో పత్తి క్వింటాలకు రూ 7,150 మాత్రమే చెల్లిస్తామని, అది కూడా 8 నుండి 12% లోపు మాత్రమే తేమ ఉండాలని చెప్పారు. ఇందుకు రైతులు అంగీకరించకపోవడంతో మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు నీరు, భోజనం లేక అల్లాడిపోయారు. డి.ఎస్.పి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement