Sunday, January 19, 2025

Adilabad – అప్పుల బాధకు మరో రైతు సూసైడ్

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో. ఆంధ్రప్రభ : పంట సాగుబడి కోసం చేసిన పెట్టుబడులు చేతి కందక అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు ఆత్మహత్యల బాటపడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ని ఐసిఐసిఐ బ్యాంకులో పురుగుల మందు తాగి జాదవ్ దేవరావు (60) శనివారం తనువు చాలించిన ఉదంతం మర్చిపోకముందే… ఆదివారం మరో గిరిజన రైతు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం కలకలం రేపింది. వీరిద్దరూ గిరిజన రైతులే కావడం, బ్యాంకుల అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి మృత్యువాత పడిన ఘటనలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

*బ్యాంకు అప్పులే బాధించాయి..!

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లింగోజి తాండకు చెందిన రాథోడ్ గోకుల్ (40) కౌలు రైతు గత 20 ఏళ్లుగా పది ఎకరాల భూమిని సాగుచేస్తూ పంట పెట్టుబడి కోసం గతంలో రూ. 6 లక్షలు యాక్సిస్ బ్యాంకు నుండి రుణం తీసుకున్నాడు. పంట దిగుబడి రాక సంక్షోభంలో ఉన్న రైతు గోకుల్ కు రుణం చెల్లించాలని బ్యాంకు సిబ్బంది వేధించడం వల్లే ఈనెల 12న క్రిమిసంహారణ మందు (గడ్డి నివారణ మందు) తాగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

విషమ పరిస్థితిలో ఉన్న రైతు గోకుల్ ను అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. గిరిజన రైతు ఆత్మహత్యఘటన వారి కుటుంబంలో తీరని విషాదం నింపింది.

- Advertisement -

దేవరావుకు కన్నీటి వీడ్కోలు..

శనివారం ఐసిఐసిఐ బ్యాంకు లోనే పురుగుల మందు తాగి చనిపోయిన రైతు జాదవ్ దేవరావు (60) అంత్యక్రియలు ఆయన సొంత గ్రామం రేణిగుడలో జరిగాయి. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, రైతు సంఘాల నేతలు, లంబాడ హక్కుల పోరాట సమితి నేతలు హాజరై నివాళులర్పించారు. ప్రభుత్వ సహాయం అందకపోవడం , బ్యాంకుల అప్పులు తీర్చలేక, సిబ్బంది వేధింపులకు గురై రైతులు ఆత్మహత్య బాటపడుతున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.

ముమ్మాటికి సర్కారు హత్యలు..! ..జోగు రామన్న.

ఆదిలాబాద్ జిల్లాలో పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా, రుణమాఫీ అందకపోవడం వల్లే సంక్షోభంలో చిక్కుకొని రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఇవి ముమ్మాటికి సర్కార్ హత్యలేనని మాజీమంత్రి జోగు రామన్న అన్నారు. అఖిలపక్షం రైతు ప్రతిధులతో కలిసి ఆదివారం రిమ్స్ పోస్టుమార్టం వద్ద రాథోడ్ గోకుల్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బ్యాంకుల సిబ్బంది వేధింపులు ఆపాలని వారు కోరారు. లేనట్లయితే రైతులను సంఘటితం చేసి ఉద్యమాలు చేస్తామని జోగు రామన్న హెచ్చరించారు.

ఆందోళనలో రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి, ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, దేవరావు పటేల్, సాజిద్ ఖాన్, యూనిస్ అక్బానీ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement