Friday, November 22, 2024

Adialabad – నకిలీ వంగడాలతో పత్తి రైతు చిత్తు…మహారాష్ట్ర సరిహద్దుల్లో జోరుగా విక్రయాలు

ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: మృగశిర కార్తెకు ముందే పత్తి విత్తనాల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్న పత్తి రైతు మెడకు నకిలీల ఉచ్చు యమపాశంలా బిగిస్తోంది. నకిలీ విత్తనాలు విత్తి అవి మొలకెత్తక బక్క పల్చని రైతు దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. నాసిరకం విత్తనాలను నల్ల బజారుకు తరలించి అక్రమార్కులు సునాయాసంగా కోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రతిరోజు కల్తీ వ్యాపారుల ఆగడాలు బయటపడుతున్నా మొక్కుబడి కేసులతో టాస్క్‌ఫోర్స్‌ చేతులు దులుపుకుంటోంది. వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు అక్రమార్కుల డీలర్ లైసెన్స్ లను రద్దు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తూ చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 1562 లైసెన్సు కలిగిన విత్తన దుకాణాలు ఉంటే.. అనధికారికంగా రెండు వేలకు పైగా సీడ్స్ దుకాణాలు పత్తి రైతుల జీవన మూలాధారంపై వ్యాపారం చేస్తూ లక్షలు గడిస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో ఆరు చోట్ల టాస్క్ ఫోర్స్ దాడుల్లో రూ.40 లక్షల విలువైన కల్తీ పత్తి విత్తనాలు బట్టబయలయ్యాయి. నకిలీ విత్తనాల దందా వెనుక రాజకీయ నేతల అండదండలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు బాసటగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు చేష్టలుడిగీ వ్యవహరిస్తున్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో నకిలీ విత్తన విక్రయాల జోరు

- Advertisement -

మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న ఆదిలాబాద్ ఆసిఫాబాద్ కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అక్రమ విత్తనాల దందా యదేచ్ఛగా సాగుతోంది. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాఎస్పీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించగా చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామ శివారులో డంపు చేసి ఉన్న 3.25 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీటి విలువ రూ. 8 లక్షల 12 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.40 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు బయటపడడం గమనార్హం.

పిడి యాక్ట్ కేసులు పెడితేనే కల్తీ దందాకు చెక్.

అమలాక రైతులకు నకిలీ విత్తనాలు వంటగడుతూ సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులపై ప్రివెన్షన్ డిటెక్టివ్ (పీడీ) కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తేనే నకిలీ విత్తనాల దందాకు కళ్లెం పడుతుందని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. విత్తన చట్టాల లొసుగుల ఆధారంగా మొక్కుబడి కేసులతో నిందితులు ఒక్కరోజులోనే బెయిలుపై బయటకు వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement