హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మహిళా కూలీపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి ఆమెను చంపేందుకు యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కూలీ పనిచేసి జీవనం సాగించే ఓ మహిళ (40) బుధవారం (జూన్ 8) శంషాబాద్ అడ్డా వద్దకు వచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరికి వచ్చి తమ వద్ద పనికి రావాలని కోరారు. కూలీ కుదరడంతో ఆ మహిళ వారితో పాటే బైక్ ఎక్కింది. అలా ఆ మహిళను కవ్వగూడ వైపు తీసుకెళ్లిన ఆ వ్యక్తులు… ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై బలవంతంగా అత్యాచారం జరిపారు. అనంతరం ఆమె తలపై బండరాయితో బలంగా కొట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను చూసి ఇక చనిపోయి ఉంటుందనుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
అటుగా పొలాలకు వెళ్తున్న కొంతమంది రైతులు రక్తపు మడుగులో ఉన్న మహిళను గుర్తించి 100కి ఫోన్ చేసి సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. బాధితురాలిని మదనపల్లి కొత్త తండాకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. కూలీ నాలీ చేస్తూ తమను పోషిస్తున్న తల్లి అత్యాచారానికి గురై మరణించడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.