ఆంధ్రప్రభ స్మార్ట్, రామగిరి (పెద్దపల్లి జిల్లా) : యాసంగికి వేరుశనగ సాగు అనువుగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేరుశనగ సాగు చేస్తే మంచి లాభాలు ఉంటాయని అన్నారు. మంచి రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా దిగుబడులు పెరుగుతాయన్నారు. రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో వేరుశనగ సాగుకు అవసరమైన విత్తనాలు తయారు చేశారు. కేవీకే రూపొందించిన వేరు శనగ విత్తనాల రకాలపై శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు.
భూసారం పెరుగుతుంది
నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. ఒకటే రకం సాగు చేస్తున్న పొలాలలో వేరుశనగ పంట ఏకైక ప్రత్యామ్నాయ పంట. వేరుశనగ సాగు చేస్తే పొలంలో ఉన్న బాక్టీరియా గాలిలోని నత్రజనిని భూమిలో బంధిస్తుంది. తద్వారా నత్రజని లోపం నివారణ అవుతూ భూ సారం పెరుగుతుంది.
అనువైన రకాలను ఎంచుకోవాలి…
తెలంగాణ లో వేరుశనగను సుమారు 1.3 లక్షల హెక్టార్లలో రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో దాదాపు 70శాతం వరకు మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోనే సాగు చేస్తున్నారు. యాసంగిలో వేరుశనగ పంటను ఉత్తర తెలంగాణలో అక్టోబర్ రెండో పక్షంలోపు, దక్షిణ తెలంగాణలో నవంబర్ రెండో పక్షం వరకు విత్తుకోవచ్చు. అధిక దిగుబడి సాధించాలంటే అనువైన రకాల ఎంపిక చేయాలి. రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు తమ ప్రాంతానికి అనువైన చీడ పీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. తద్వారా పంట దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
వేరుశనగ విత్తనాల కొత్త రకాలు
పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో తొలిసారిగా రెండేళ్ల కిందట నూనె గింజలు- సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా అందులో తయారు చేసిన కదిరి లేపాక్షి (కే- 1812) వెరైటీ వంగడాలను పరిచయం చేశారు. తొలి దశలో పది హెక్టార్ల విస్తీర్ణంలో ఈ వంగడాలను విత్తి రైతులకు పరిచయం చేశారు. పెద్దపల్లి జిల్లాలో తేలిక నేలలు ఉన్నప్పటికీ అధిక నీటి వసతి ఉండటం వల్ల రైతులు ఎక్కువగా వరి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం వివిధ మండలాల్లో పర్యటించి ఈ వంగడాలపై రైతులకు అవగాహన కల్పించారు. వరికి ప్రత్నామ్నాయ పంటగా రబీలో వేరుశనగ పంటను రైతులకు సిఫారసు చేశారు.
శాస్త్రవేత్తలు సూచించిన వంగడాలు
జగిత్యాల- 88 (జె.సి.జి-88)
కదిరిచిత్రావతి (కె-1719)
కదిరిలేపాక్షి (కె-1812)
కదిరి- 6(3-1240)
కదిరి- 9
కదిరిహరితాంధ్ర (కె-1319)
కదిరి అమరావతి (కె-1535)
విశిష్ట (టి.సి.జి.యస్-1694)
నిత్యహరిత (టి.సి.జి.యస్-1157)
ధరణి (టి.సి.జి.యస్ 1043)
బిఎఆర్సి (బార్క్) నుండి విడుదలైన రకాలు
టి.ఎ.జి-24:
గిర్నార్ – 4(ఐ.సి.జి.వి.-15083)
గిర్నార్ – 5 (ఐ.సి.జి.వి-15090)
జి.జి-40 (ఐ.సి.జి.వి-16668)
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
- డాక్టర్ కిరణ్ పిల్లి, మృత్తిక శాస్త్రవేత్త, కేవీకే, రామగిరి ఖిల్లా (10పిపిఎల్6)
యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి. భూసారం బట్టీ అనుకూలమైన రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి. యాసంగి 110 రోజులు దాటిన రకాలకు చివరి దశలో బెట్ట పరిస్థితులు ఎదురైతే నేల రకాన్ని బట్టి నీటి తడులను 7-10 రోజుల వ్యవధిలో అందజేయాలి. సరైన రకాలను ఎంచుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వేరుశనగలో అధిక దిగుబడులు సాధించవచ్చు.