- చలో రాజ్‌భవన్ కార్యక్రమం
- రోడ్డు పై బైఠాయించిన కాంగ్రెస్ నేతలు
- బీఆర్ఎస్‌పై మండిపాటు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : అదానీ-మోడీ సంబంధం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అదానీ వ్యాపారాలు, మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో రాజ్ భవన్ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డు నుంచి కాలినడకన రాజ్ భవన్ వద్దకు కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు.
రోడ్డు పై బైఠాయింపు…
ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేతలు.. అదానీ, మణిపూర్ ఘటనలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్లమెంట్ లో ఈ అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న తమను హైదరాబాద్ పోలీసులు కూతవేటు దూరంలో అడ్డుకున్నారని.. ఈ క్రమంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నామని సీఎం చెప్పారు. ప్రభుత్వంలో ఉండి తాము చేస్తున్న ఈ నిరసన కొంత మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చని అన్నారు. అలాగే పార్లమెంట్‌లో అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని, అలా చేస్తూ అదానీ కచ్చితంగా జైలుకు వెళ్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదానీ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సభలో అదానీ అంశంపై తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుదామన్నారు.
లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి సృష్టించారు…
అదానీ-మోడీ సంబంధం దేశపరంగా ప్రతిష్టను దెబ్బతీస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ దేశంలో వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితిని మోడీ-అదానీ సృష్టించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అదానీ అవకతవకలపై జాతీయ పర్యవేక్షణ కమిటీ (జేపీసీ) ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. అదానీ విషయంలో ప్రధాని మోడీ కనీసం మాట్లాడటానికి కూడా సిద్ధపడడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు, ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ వ్యవహారాన్ని రాజ్యసభలో లేవనెత్తాలని కోరారు.
వారు చేయరు.. మేము చేస్తే తప్పు పడతారు…
ఈ ధర్నాలో బీఆర్‌ఎస్ పార్టీపై కూడా సీఎం విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు చెయ్యరు… తాము చేస్తే… తప్పు పడుతారని ఆరోపించారు. తాము నిరసన చేస్తుంటే తమ్మల్ని అవహేళన చేస్తున్నారని, వాళ్ళు అదానీకి, మోడీ కి లొంగిపోయారని విమర్శించారు. ఇలాంటి నిరసనలను తప్పు పడుతున్నారని, బిఆర్‌ఎస్ కు కనీస నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, ఈ కార్యక్రమాన్ని దేశ భవిష్యత్తుకు, ప్రజల సంక్షేమానికి గల బాధ్యతగా చూడాలన్నారు.