నటుడు నవదీప్ హైదరాబాద్ నార్కోటిక్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ కేసులో భాగంగా ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ సప్లయర్ రామచందర్ తో నవదీప్ కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీయనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ దందాలో ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ప్రశ్నించనున్నారని సమాచారం. కోర్టు సూచనతో ఇవాళ విచారణకు హాజరు కావాలని నవదీప్ కు పోలీసులు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.
కాగా డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు రావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారని పోలీసులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.