Friday, November 22, 2024

TS | వ‌డ్ల కొనుగోళ్లపై కార్యాచరణ రెడీ.. అందుబాటులో అన్ని వ‌స‌తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ధాన్యం కొనుగోలు అంశంతోపాటు సీఎంఆర్‌ బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు ఫుడ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ)తో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలంగాణ సివిల్‌ సప్లయ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ అన్నారు. అయితే ఆశించిన స్థాయిలో ఎఫ్‌సీఐ సహకరించడం లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పంజాబ్‌ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతోందని, ఆ ధాన్యం కొనుగోలులో, స్టోరేజీ సదుపాయం కల్పించడంలో, సీఎంఆర్‌ బియ్యాన్ని వంకలు పెట్టకుండా తీసుకోవడంలో ఎఫ్‌సీఐ ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని వాపోయారు. ఎఫ్‌సీఐ స్టోరేజీ సదుపాయాన్ని కల్పిస్తే నెలకు పదిలక్షల మెట్రిక్‌ టన్నులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ నేపథ్యంలో సివిల్‌ సప్లయ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ బాధ్యతలు కత్తిమీద సాములా మారాయని వ్యాఖ్యానించారు. ఆయన ‘ఆంధ్రప్రభ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వీలైనంత త్వరగా స్టోరేజీని పెంచి సీఎంఆర్‌ బియ్యాన్ని వేగంగా తీసుకోవాలని ఎఫ్‌సీఐని కోరారు. ఎఫ్‌సీఐ కొర్రీల నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ సీజన్‌ పంటను ఆ సీజన్‌లోనే మిల్లింగ్‌ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించామని చెప్పారు. ఎఫ్‌సీఐ నిబంధనల కారణంగా రాష్ట్రంలోని మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళుతూనే ఉన్నామన్నారు. అదే సమయంలో మిల్లింగ్‌ విషయంలో రైస్‌ మిల్లర్ల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామని తెలిపారు.

ఈ ఏడాది యాసంగి-2023లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైన గోనె సంచులు, ప్యాడీ క్లీనర్లు, కొనుగోలు కేంద్రాలకు కమిషన్ల బకాయిల చెల్లింపులు అన్నీ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తున్నారని, అందులో భాగంగానే రేషన్‌ డీలర్ల కమిషన్‌ను కూడా రూ.1400కు పెంచారని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ కోటాకు అదనంగా లబ్దిదారులకు బియ్యాన్ని ఇవ్వడం లేదని కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నామన్నారు. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 90.05 లక్షల కార్డుల్లో దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తోందని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement