Thursday, November 21, 2024

TS | శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు : సీపీ కల్మేశ్వర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, (ప్రభ న్యూస్) : శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింఘేనివార్ అన్నారు. ఇవ్వాల‌ (శనివారం) జిల్లా కేంద్రంలోని పోలీస్ పారేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రౌడీ షిటర్ల మేళా కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింఘేనివార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో మొత్తం 326 మంది రౌడీ షీటర్లు ఉన్నారన్నారు. ఈ మేళాలో రౌడీషీటర్ల దినచర్యలు, వారి రాకపోకలు క్షుణ్ణంగా తెలుసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరిని కలిశారు, ఎందుకు కలుస్తున్నారు, భవిష్యత్తులో ఎలాంటి అల్లర్లు/శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారనే తెలుసుకున్నామని తెలిపారు.

రౌడీ షిటర్లు ప్రతీ రోజు వారి ఉద్యోగం నిర్వహించుకుంటు వారి ఇంటి వద్దనే ఉండాలని.. ఎలాంటి గొడవలకు దిగవద్దని, ప్రధాన కూడళ్లలో సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. రాత్రి పూట హోటళ్ల వద్ద, పాన్ షాపుల వద్ద ఉండరాదని ఆదేశించారు. ప్రతి ఒక్క రౌడీషీటర్ తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించినా, సమాజంలో ఉద్రిక్తతలను రేకెత్తించేలా ప్రవర్తించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట ప్రకారం కేసులు నమోదు చేసిన ప్రతిసారీ వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐ.పి.ఎస్., బి. చైతన్య రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఎ.సి.పి.ఎల్. రాజా వెంకట్ రెడ్డి, బస్వర్ రెడ్డి, పి.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ శ్రీశైలం, సీఐలు, ఎస్ ఐలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement