ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : రైతులను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నిర్వాహకులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కచ్చితంగా ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సూచించారు. శనివారం కొత్తపల్లి మండలం మల్కాపూర్, బద్దిపెల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కేంద్రాలకు వచ్చింది.. ఆయా సెంటర్ల పరిధిలో ఎంత మంది రైతులు ఉన్నారు.. ఇంకా ఎన్ని క్వింటాళ్ల ధాన్యం రానుంది.. అన్ని సౌకర్యాలు కల్పించారా.. అని అధికారులను జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వరి ధాన్యం తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు. సరైన తేమశాతం వచ్చేలా ధాన్యాన్ని ఆరబెట్టాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు, తేమ శాతం పేరిట ధాన్యానికి ఎలాంటి కోత విధించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రైస్ మిల్లర్లు సైతం ధాన్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలున్నా రైతులు తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అధికారులు హమాలీలు, రైతుల కోసం తాగునీరు, విశ్రాంతి తీసుకునేందుకు నీడ వసతి కల్పించాలని పేర్కొన్నారు. ఒకవేళ వర్షం కురిస్తే ధాన్యం తడవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలతో పాటు రైస్ మిల్లర్లకు నాణ్యమైన గన్నీ బాగులు అందించాలని సూచించారు.
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సరైన తేమ శాతం వచ్చినా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఆయా సెంటర్ల ఇన్చార్జులు, మిల్లర్లు ధాన్యాన్ని తక్కువ ధరకు కొనవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగిన తగిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. మల్కాపూర్ లో కొనుగోలు కేంద్రం వద్ద విశ్రాంతి తీసుకునేందుకు షెడ్డు నిర్మించాలని జిల్లా కలెక్టర్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. ప్యాడీ క్లీనర్, తాగునీటి వసతి, షెడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం రజనీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ సురేందర్, ఆర్ఐ అరుణ్, పలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.