మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని, మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి పథకం కింద చేపట్టిన పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసేందుకు, సమగ్ర ప్రణాళికను సంసిద్ధం చేసి అమలు చేసేందుకు ఒక నోడల్ ఏజెన్సీగా పని చేయడానికి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. నాగోల్, చాదర్ ఘాట్, ముస్లింజంగ్ బ్రిడ్జి వద్ద మూసీ అంచులపై వాక్ వేలతో పాటు, సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. మూసీలో తేలియాడే చెత్తను తొలగించేందుకు పది ప్రదేశాల్లో ఫ్లోటింగ్ ట్రాష్ బారియర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. దోమల బెడదను, దుర్వాసనను అరికట్టేందుకు హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లు, పొగ చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital