Saturday, November 23, 2024

Delho: చర్యల్లేవ్-బుజ్జగింపులే.. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఆయన బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలతో హైకమాండ్ చర్యలు చేపడుతుందని భావించినా బుజ్జగింపుకే మొగ్గుచూపింది. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశానికి రావాల్సిందిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి.శ్రీధర్ బాబులను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం టాగూర్ కోరారు. జ్వరంగా ఉందంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈసమావేశానికి హాజరు కాలేదు.

రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పైనే నేతలు ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ….  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కేసీ వేణుగోపాల్ నివాసంలో చర్చలు జరిపినట్టు చెప్పారు. పార్టీలో చేరికలకు సంబంధించి అధిష్టానంతో మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇతర రాజకీయ పరిణామాల గురించి కూడా మాట్లాడామని తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై వస్తున్న వార్తలపై చర్చించామని వెల్లడించారు.

ఎవరైనా మనస్థాపానికి గురై ఉంటే వారితో చర్చించి పార్టీలోనే ఉండేలా ఒప్పించబోతున్నామని భట్టి తెలిపారు. బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడతారని, ఆయనొక రాజకీయ ఉన్మాది అని మండిపడ్డారు. అనుకోకుండా ఎక్కడైనా బీజేపీ నేతలు ఎదురుపడ్డప్పుడు మాట్లాడితే దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డితో మూడు గంటల పాటు కూర్చుని మాట్లాడానని తెలిపారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అంటే గౌరవం ఉందని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement